
Ayyanna patrudu latest news(AP political news) :
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తలు ఏపీలో కలకలం రేపాయి. పొలిటికల్ హీట్ ను పెంచాయి. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభా వేదికపై అయ్యన్నపాత్రుడుతోపాటు చాలా మంది టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం వైఎస్ జగన్, పలువురు మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే అయ్యన్నపాత్రుడి సహా పలువురి నేతలపై కేసు నమోదైంది.
శుక్రవారం ఉదయం ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు అయ్యన్న చేరుకున్నారు. అప్పటికే అక్కడ మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు అయ్యన్నను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతఎలమంచిలి వద్ద 41A నోటీసులు ఇచ్చి అయ్యన్నను విడుదల చేశారు.
గన్నవరం సభలో అయ్యన్నపాత్రుడు సహా పలువురు టీడీపీ నేతలు ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడిపై 153A, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
తన అరెస్ట్ పై అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఢిల్లీ నుంచి తాను విశాఖ వచ్చానని వెల్లడించారు. తనపై కేసు నమోదు చేశామని చెప్పి విమానాశ్రయం వద్ద హనుమాన్ జంక్షన్ సీఐ అరెస్టు చేశారని తెలిపారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్యాయాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. భయపడే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు.
అయ్యన్నను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. అక్రమ కేసులతో పోలీసులు వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. అలా అయితే మంత్రులు, వైసీపీ నేతలను జీవితాంతం జైల్లో పెట్టాలన్నారు. సీఎం జగన్ తప్పుల్లో పోలీసులు భాగస్వాములైతే మూల్యం చెల్లించక తప్పదన్నారు.
అయ్యన్నపాత్రుడి అరెస్ట్ జగన్ నిరంకుశ పాలనకు పరాకాష్ఠ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజాస్వామ్య మూలాలను జగన్ ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?అని అచ్చెన్న ప్రశ్నించారు.