TDP vs YCP on Mirchi: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల మద్దతు ధర లభించడం లేదని మిర్చి రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కేంద్రంతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని కోరింది. అంతలోనే మాజీ సీఎం జగన్ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులకు మద్దతు పలికారు. మొత్తం మీద ఈ క్రెడిట్ కూటమి ప్రభుత్వానిదని కొందరు అంటుండగా, మరికొందరు జగన్ పర్యటనతోనే కేంద్రం స్పందించిదని సోషల్ మీడియాలో వైరల్ చేయడం విశేషం.
ఏపీలో మిర్చి సాగు చేసే రైతులు అధికం. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పల్నాడు, కడప, ఇతర జిల్లాలలో రైతులు మిర్చి పంటను అధిక సంఖ్యలోనే సాగు చేస్తారు. అయితే మిర్చికి కనీస మద్దతు ధర లేదని, గుంటూరు మిర్చి యార్డు వద్ద ఇటీవల రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, పెట్టిన పెట్టుబడులు కూడా రాలేని పరిస్థితి ఉందని రైతులు తీవ్ర ఆవేదన చెందారు.
రైతుల సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించగా, మాజీ సీఎం ఛలో మిర్చి యార్డు అంటూ గుంటూరుకు పయనమయ్యారు. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జగన్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. జగన్ మాత్రం పార్టీ కీలక నేతలతో కలిసి మిర్చి మార్కెట్ యార్డుకు వెళ్లి రైతులను పరామర్శించారు. ఈ సంధర్భంగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా జగన్ సీరియస్ కామెంట్స్ చేశారు.
ఏపీలో రైతన్నల పరిస్థితి దారుణంగా ఉందని, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జగన్ ఆరోపించారు. అయితే జగన్ గుంటూరు పర్యటన అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో మిర్చి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. అంతకుముందే కేంద్రానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు, రైతన్నలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు. అప్పటికే కేంద్రంతో పలు దఫాలు సీఎం చంద్రబాబు చర్చించి, మిర్చి రైతులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానంటూ చెప్పారు.
ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు వెంటనే రాష్ట్రానికి వచ్చి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. మిర్చి రైతులకు న్యాయం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఓ వైపు సీఎం చంద్రబాబు చొరవ చూపినా, జగన్ మాత్రం తన విమర్శలకు పదును పెట్టారని చెప్పవచ్చు. ఈ దశలోనే కేంద్రం నుండి రావాల్సిన శుభవార్త రానే వచ్చింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. మార్కెట్ ఇంటర్వేన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ. 11,781లు చెల్లించి కొనేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని పెమ్మసాని ట్వీట్ చేశారు.
Also Read: YS Jagan: అసెంబ్లీకి జగన్.. RRR కామెంట్స్ ప్రభావమా? షర్మిళ మాటలా?
ముందుగా 25 శాతం మిర్చిని కేంద్రం కొనుగోలు చేస్తుందని, అవసరానికి అనుగుణంగా కొనుగోళ్లను పెంచడం జరుగుతుందన్నారు. కేంద్రం ప్రకటనపై మిర్చి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే మిర్చి మద్దతు ధరపై కేంద్రం ప్రకటన ఇవ్వగా, ఈ క్రెడిట్ మాదంటూ మాదంటూ కూటమి, వైసీపీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంటున్నాయి.