Tirumala Darshan Update Today: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శన సమాచారం..
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 60784 మంది భక్తులు దర్శించుకోగా.. 25521 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.29 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే రూ. 300 ల శీఘ్రదర్శనంకు 3 నుండి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
ముంబైలో టీటీడీ సమాచార కేంద్రం..
నవీ ముంబైలో అమ్మవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం నిర్మించేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు ద్వారా మహారాష్ట్ర సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ కు వినతి పత్రం అందజేశారు.
సోమవారం సాయంత్రం తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్ లో మూడు రోజుల పాటు జరగనున్న కుంభ్ ఆఫ్ టెంపుల్స్ సదస్సు తొలిరోజు ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు, గోవా సీఎం ప్రమోద్ సావంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లతో కలిసి టీటీడీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవీ ముంబైలో అమ్మవారి ఆలయం, టీటీడీ సమాచార కేంద్రం నిర్మాణాలకు కొంత స్థలం కేటాయించాలని మహారాష్ట్ర సీఎం కు టీటీడీ చైర్మన్ వినతి పత్రం అందజేశారు.
Also Read: Horoscope Today February 18th: ఆ రాశి వారు ఇవాళ ఆర్థిక వ్యవహారాలలో ఆప్రమత్తంగా ఉండాలి
ఇప్పటికే నవీ ముంబైలో ఉల్వే ప్రాంతంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 3.61 ఎకరాల స్థలాన్ని లీజు ప్రాతిపదికన కేటాయించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరో 1.50 ఎకరాల స్థలంలో అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందని, ఈ మేరకు స్థలాన్ని కేటాయించాలని, బాంద్రాలో టీటీడీ సమాచార కేంద్రానికి కూడా కొంత స్థలాన్ని కేటాయించాలని టీటీడీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
కాగా ఈనెల 26 న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లలో టీటీడీ నిమగ్నమైంది. అలాగే అన్ని శైవక్షేత్రాలను కూడా శివరాత్రి సంధర్భంగా ఆలయాల కమిటీ సభ్యులు, అధికారులు ముస్తాబు చేస్తున్నారు. పెద్ద ఎత్తున శైవక్షేత్రాలలో అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఏపీలోని శ్రీశైల క్షేత్రంకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న సంధర్భంగా ఆలయ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి నుండి మహాశివరాత్రి మహోత్సవాలు శ్రీశైలంలో ప్రారంభం కానున్నాయి.