Alipiri Checkpoint: ఉగ్రవాద ముప్పు, అంతర్జాతీయ స్థాయి మోసాల నేపథ్యంలో, శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలోకి ప్రవేశించే ప్రధాన ద్వారం అయిన అలిపిరిపై భద్రత మరింతగా కట్టుదిట్టం కానుంది. ఇకపై అనుమానాస్పద వ్యక్తులైనా, వాహనాలైనా.. అలిపిరిని దాటడం అంత ఈజీ కాదు. భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ఆధునిక భద్రతా సాంకేతిక పరిజ్ఞానంతో తిరుమలలో భద్రతను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో రాష్ట్ర డీజీపీ హరిష్ కుమార్ గుప్తా, టీటీడీ ఈవో జె. శ్యామల రావు సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష సమావేశం ఈ దిశగా కీలకంగా నిలిచింది. భద్రతా సంస్థల మధ్య సమన్వయం, సైబర్ భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.
అలిపిరికి అదనపు భద్రతా ముస్తాబు
తిరుమలలోకి ప్రవేశించేందుకు ప్రధాన ద్వారం అయిన అలిపిరిపై బహుళ స్థాయి వాహన తనిఖీ కేంద్రాన్ని మరింత ఆధునికీకరించే యోచన అధికారులదే. డిఫెన్స్ శాఖతో కలిసి సెన్సార్ ప్లే సిస్టమ్, ఖచ్చితమైన చెకింగ్ పాయింట్లు, రియల్ టైం నిఘా కెమెరాలు అమర్చే దిశగా చర్చలు జరిగాయి. అనుమానాస్పద వాహనాల గుర్తింపు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాలు వాడేలా చర్యలు చేపట్టనున్నారు.
భద్రతపై సమగ్ర ప్రజెంటేషన్
సమావేశంలో తిరుపతి ఎస్పీ, టీటీడీ సీవీఎస్వో హర్షవర్ధన్ రాజు భద్రతాపరంగా ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లు, భక్తుల రద్దీ సమయంలో తీసుకునే చర్యలు, ఉత్సవాల సందర్భంగా అమలు చేసే భద్రతా ప్రణాళికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
డీజీపీ కీలక దిశానిర్దేశం
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, తిరుమలకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, నిత్యం లక్షలాది మంది భక్తుల రాకపోకలు, ముఖ్యంగా ప్రముఖులు, విదేశీ భక్తులు వస్తుండటంతో భద్రత విషయంలో ఎలాంటి ఉదాసీనతా ఉండకూడదని పేర్కొన్నారు. ఏపీఎస్పీ, డీఏఆర్, ఎస్పీఎఫ్, హోంగార్డులు, సివిల్ పోలీస్, టీటీడీ సెక్యూరిటీ వంటి విభిన్న భద్రతా బలగాల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. స్థిరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించి అందరికి అందుబాటులో ఉంచాలని తెలిపారు. సైబర్ భద్రతా అంశాల్లో నిర్లక్ష్యం లేకుండా, అత్యాధునిక సాఫ్ట్‌వేర్, మానిటరింగ్ టూల్స్ వినియోగించాలని చెప్పారు.
Also Read: One Rupee Train Ticket: ఒక్క రూపాయికే రైలు టికెట్.. ఇండియన్ రైల్వే ఐడియా అదుర్స్!
టీటీడీ ఈవో స్పందన
టీటీడీ ఈవో జె. శ్యామల రావు మాట్లాడుతూ, భద్రతపై అన్ని అనుబంధ సంస్థల మధ్య సమన్వయం అత్యంత అవసరం అని అభిప్రాయపడ్డారు. భక్తుల భద్రతకు మరింత బలమైన మెకానిజం ఏర్పాటుకి సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా వివరించారు.
ఇతర ఉన్నతాధికారుల చర్చలు
ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మధుసూదన్ రెడ్డి, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ మహేష్ చంద్ర లడ్డా, అనంతపురం రేంజ్ డీఐజీ డా. శేముషి, ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, డీఎఫ్ఓ వివేక్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, నిఘా విభాగం, భద్రతా విభాగాధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భక్తులకు భద్రతా హామీ
ఈ సమీక్షతో తిరుమలలో భద్రత మరింత పటిష్టంగా మారనుంది. ఇకపై అలిపిరి వద్ద అనుమానాస్పద వ్యక్తులకైనా, వాహనాలకైనా తనిఖీల్లో తప్పించుకునే అవకాశం ఉండదనే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. భద్రత పట్ల ప్రభుత్వ, టీటీడీ, పోలీసు శాఖల దృష్టి భక్తుల నమ్మకాన్ని మరింత పెంచనుంది. ఇవాళ్టి మారుతున్న భద్రతా దృక్పథంలో.. తిరుమల భద్రతా ప్రణాళిక భక్తులకు బలమైన రక్షణగా నిలవనుంది. ఇకపై అలిపిరి గడువు తీరింది.. చట్ట విరుద్ధంగా ప్రవేశించాలనుకునేవారికి ఇక చుక్కలేనని చెప్పవచ్చు.