Tirumala Temple Hotel:: విశాఖపట్నం హైవే రోడ్డుపై ఓ మిలిటరీ హోటల్ తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడి నమూనాతో నిర్మించబడి ఉండటమే కాకుండా, జయ – విజయలు, బంగారు వాకిలి, రాములవారి మెడ, కులశేఖర పడి లాంటి కీలక ప్రాంతాల నమూనాలతో సెట్ వేయడంపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హోటల్ లో నాన్ వెజ్ వంటలు వడ్డించడంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను కించపరచినట్లు భక్తులు మండిపడుతూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
తిరుమల గర్భాలయ నమూనా.. అది కూడా హోటల్ రూపంలో?
తిరుమల శ్రీవారి గర్భాలయం అంటే ప్రతి హిందువు గుండె లోతుల్లో భక్తితో నిలిచే పవిత్ర స్థలం. అలాంటి ఆలయ నమూనాను ఉపయోగించి ఓ హోటల్ నిర్మించడం, అందులో మాంసాహార వంటకాలను వడ్డించడం నిజంగా శ్రద్ధా సంపన్న భక్తుల మనసును కలచివేస్తోందన్నది అసలు ఆరోపణ. ఇది సాధారణ వ్యాపార చర్యగా కాకుండా, భక్తుల మత భావనలపై అవమానకరంగా ఉందంటూ భక్తులు మండిపడుతున్నారు.
రాయుడు మిలిటరీ హోటల్
విశాఖపట్నం హైవే పక్కనే ఉన్న ఈ హోటల్ పేరు రాయుడు మిలిటరీ హోటల్. హోటల్ నిర్మాణం మొత్తం తిరుమల ఆలయ నిర్మాణ శైలిలోనే తీర్చిదిద్దబడినట్లు వైరల్ అవుతోంది. హోటల్ గేటు వద్ద జయ, విజయల విగ్రహాలు, ఆలయ సుదర్శన చక్రం గుర్తులు, స్వామివారి మెడలో కనిపించే అలంకరణలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. తీర్థక్షేత్ర గౌరవాన్ని వ్యాపారానికి వాడకూడదన్నది పలువురి భక్తుల వాదన.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఆలయం ఒక్కటే కాదని, అది కోట్లాది హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం. అలాంటి గర్భాలయ నమూనాను ఓ మాంసాహార హోటల్ కు ఉపయోగించడమేంటని ప్రశ్నిస్తున్నారూ భక్తులు. ఇది భక్తుల మనోభావాలను గాయపరచడమే కాకుండా, తిరుమల ఆలయం గొప్పతనాన్ని, గౌరవాన్ని తక్కువ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టీటీడీకి ఫిర్యాదు చేసిన కిరణ్ రాయల్
ఈ హోటల్ వ్యవహారాన్ని గుర్తించిన తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ అనే భక్తుడు తక్షణమే టీటీడీ ఈఓ, చైర్మన్ లకు ఫిర్యాదు చేశారు. ఫోటోలు, వీడియోలతో సహా పూర్తి సమాచారం అందజేశారు. ఇదే కాకుండా హోటల్ ఎదుట నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. తిరుమల గౌరవాన్ని ఈ స్థాయిలో తక్కువ చేస్తూ ఎవరు వ్యాపారం చేసినా సహించేది లేదని స్పష్టంగా హెచ్చరించారు.
Also Read: TTD feedback system: తిరుమలలో ఇబ్బంది ఎదురైందా? ఈ ఒక్కటి చేస్తే చాలు.. అందరూ మీ చెంతకే!
చర్యలు తీసుకోకపోతే ఉద్యమమే!
ఇలా శ్రీవారి గర్భాలయ నమూనాలతో నాన్ వెజ్ హోటళ్లు పెరిగిపోతే ఇది భక్తుల మనోభావాలపై ఘాతుకమే అవుతుంది. దీని పట్ల చర్యలు తీసుకోకపోతే, రాయుడు హోటల్ ఎదుట భక్తులంతా పెద్ద సంఖ్యలో ఆందోళన చేయడానికి సిద్ధం అవుతున్నామని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. ఆయన మాటలకు సోషల్ మీడియాలోను భారీ స్పందన లభిస్తోంది.
ఇలాంటి వాటిని అరికట్టడానికి టీటీడీ దృష్టి పెట్టాలని కిరణ్ రాయల్ అభిప్రాయపడుతున్నారు. కిరణ్ రాయల్ చేసిన ఫిర్యాదులో మరో కీలక అంశం ఉందని కొందరు భక్తులు వాదిస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు విజిలెన్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమల ఆలయ నమూనాలు, గుర్తులు ఎవరు దుర్వినియోగం చేస్తున్నారో పర్యవేక్షించే ప్రత్యేక బృందం అవసరం అన్నది ఆయన అభిప్రాయం.
మండిపడుతున్న భక్తులు
ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ప్రతిష్ఠను బిజినెస్‌కు వాడుకోవడం ఎంతవరకు న్యాయం? ఇది కేవలం అలంకరణ కాదు.. మతసంబంధిత గౌరవాన్ని తృణప్రాయంగా తీసుకునే చర్య అంటూ స్పందిస్తున్నారు. కొన్ని సంఘాలు ఇప్పటికే హోటల్ మూసివేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇలాంటివి ఒకసారి తలెత్తితే భవిష్యత్‌లో మరిన్ని ఉదంతాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే టీటీడీ ఈ విషయంలో తక్షణమే స్పందించి, న్యాయపరంగా, పరిపాలనా పరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. తిరుమల గర్భాలయ నమూనా పేరుతో మాంసాహార హోటల్ నడిపిన వ్యవహారం పునరావృతం కాకుండా.. టీటీడీ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మొత్తం మీద ఈ విషయంపై టీటీడీ దృష్టి సారించినట్లు సమాచారం. అయితే చివరగా కొసమెరుపు ఏమిటంటే.. భక్తి కొద్ది ఆ నమూనాను తయారు చేసి ఉండవచ్చని, మరికొందరు నెటిజన్స్ హోటల్ యాజమాన్యానికి మద్దతుగా కామెంట్స్ చేయడం విశేషం.