Tirumala News: చుట్టూ పవిత్రమైన ఏడు గిరుల మధ్య కొలువైన శ్రీ శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలిగితే మహా పుణ్యంగా భావిస్తారు భక్తులు. అందుకే నిరంతరం తిరువీధులు భక్తులతో కిటికిటలాడుతుంటాయి. గోవిందా.. గోవిందా.. అనే పవిత్ర నామస్మరణతో మారుమ్రోగుతుంటాయి. స్వామివారి దర్శన భాగ్యం కోసం ఎందరో భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకుంటారు.
అలాగే అలిపిరి మెట్ల మార్గం నుండి కాలినడక సాగించి స్వామి వారిని దర్శిస్తే మహా పుణ్యంగా భావిస్తారు భక్తులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే చాలు.. ఆ కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల విశ్వాసం. తమ కోరికలు నెరవేరిన వెంటనే స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం, అలాగే తలనీలాలు సమర్పించడం భక్తుల అచంచలమైన భక్తికి నిదర్శనం.
ఇటీవల తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు టీటీడీ పలు సూచనలు జారీ చేసింది. తిరుమలకు వచ్చే భక్తుల కోసం తిరుమలలో 24 గంటల వైద్య సదుపాయాన్ని కల్పించడం జరిగిందని, అత్యవసర సమయంలో భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.
అలాగే ఉబ్బసం వంటి వ్యాధిగ్రస్తులు పలు జాగ్రత్తలు తీసుకుంటూ కాలినడక సాగించాలని కోరింది. తాజాగా టీటీడీ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉందని చెప్పవచ్చు. కానీ భక్తుల రద్దీ తగ్గినా, తిరుమల శ్రీవారి హుండీ కానుకల ద్వారా వచ్చే ఆదాయం పెరగడం విశేషం.
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే శనివారం స్వామి వారిని 63,729 మంది భక్తులు దర్శించుకోగా.. 20,957 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.85 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే కంపార్ట్ మెంట్స్ ఖాళీగా ఉండగా, నేరుగా శ్రీవారిని దర్శించే క్యూ లైన్ మాత్రమే రద్దీగా ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది.