Woman Kidnaps Boyfriend: ప్రియుడిపై ప్రేమ ఉండొచ్చు కానీ, మరీ ఇంత ప్రేమనా.. అది కూడా తనకు దూరంగా ఉంటున్నాడని కిడ్నాప్ కే యత్నించింది ఓ ప్రియురాలు. అప్పటికే వివాహమై భర్తకు దూరంగా ఉంటున్న ఆ ప్రియురాలు.. ప్రియుడిని తన వద్దకు రప్పించుకునేందుకు పెద్ద ప్లానే వేసింది. ఈ ఘటన ఏపీలోని మదనపల్లి లో జరగగా, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది.
మదనపల్లికి చెందిన సోనియా భానుకు తిరుపతికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం నెమ్మదిగా సహజీవనం వరకు తీసుకెళ్ళింది. దీనితో వారిరువురు ప్రేమికుల వలె కలిసిమెలిసి ఉండేవారు. కానీ అప్పటికే వివాహమై తన భర్తకు దూరంగా ఉంటోంది సోనియా భాను. ఈ విషయం ఆ యువకుడు తెలుసుకున్నాడో ఏమో కానీ, గత కొద్ది రోజులుగా సోనియాకు దూరంగా ఉంటున్నాడట. తనకు ఎందుకు దూరంగా ఉంటున్నాడు అర్థం కాని సోనియా భాను, ఎలాగైనా ఆ యువకుడిని తన వద్దకు తెప్పించుకునేందుకు పెద్ద ప్లాన్ వేసింది.. అదే కిడ్నాప్.
అనుకున్నదే తడవుగా కిడ్నాప్ చేసేందుకు ఐదుగురితో ఒప్పందం కుదుర్చుకుంది సోనియా. ఆ ఐదుగురు కిడ్నాప్ చేసేందుకు పథకం సైతం రచించారు. యువకుడిని కిడ్నాప్ చేసి వాహనంలో తరలిస్తుండగా, అతని ఫ్రెండ్స్ గమనించారు. తనను కాపాడండి అంటూ సదరు యువకుడు కేకలు వేస్తుండగా, వారు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: Nagababu on Pawab Kalyan: నాగబాబు క్లారిటీ, పవన్ ఎప్పుడూ దూరమే
ఇక పోలీసులు సైతం ఛేజింగ్ మొదలుపెట్టారు. చిట్ట చివరకు వాయల్పాడు వద్ద సదరు యువకుడిని కిడ్నాపర్ల వద్ద నుండి పోలీసులు రక్షించారు. కిడ్నాపర్లను విచారిస్తే అసలు విషయం తెలుసుకున్న యువకుడు షాక్ కు గురయ్యాడు. తన కిడ్నాప్ కు యత్నించింది సోనియా భాను అని తెలుసుకొని, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అందుకే అంటారేమో ప్రేమ ఉండొచ్చు కానీ, మరీ కిడ్నాప్ చేసేంతవరకు దారి తీయడం ఇక్కడ కొసమెరుపు.