శౌర్యం, శాంతం, సమరం.. అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కలసి నడుస్తున్న ఫొటోకి ట్యాగ్ లైన్లు పెట్టి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి తెచ్చారు. ఆగస్ట్-15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీలో స్త్రీ శక్తి పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముగ్గురు నేతలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ముగ్గురు నేతలు కలసి ఉన్న ఫొటోలు బాగా హైలైట్ అయ్యాయి. బస్సు ప్రయాణం కూడా సరదాగా సాగింది. ఈ కాంబినేషన్ ఇలానే ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. పవన్ లోని శౌర్యం, చంద్రబాబు శాంతం, లోకేష్ సమరోత్సాహం గురించి వర్ణిస్తున్నారు.
సరదా సంభాషణ..
ఉచిత బస్సు పథకం ప్రారంభోత్సవంలో ముగ్గురు నాయకులు ఎక్కిన బస్సులో సరదా సంభాషణ చోటు చేసుకుంది. బస్సు ఎక్కగానే సీఎం చంద్రబాబు కండక్టర్ కి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా టికెట్ కోసం డబ్బులు ఇవ్వబోయారు. ఆయన్ను మంత్రి నారా లోకేష్ వారించారు. తనతోపాటు సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కి టికెట్లు తానే తీస్తానన్నారు. కండక్టర్ కి డబ్బులు ఇచ్చిన లోకేష్.. సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన డబ్బులు వారికే వెనక్కి ఇప్పించేశారు. తన నియోజకవర్గంలో బస్సు టికెట్ డబ్బులు తానే ఇచ్చానని, అందుకే తన నియోజకవర్గ అభివృద్ధి కి నిధులు బదులివ్వాలని సరదాగా అన్నారు.
2024 ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ, జనసేన కలవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోలేదు. దీంతో కూటమి ఘన విజయం సాధించింది. ఈ గెలుపుకి ప్రధాన కారణం కూటమి ఐకమత్యంగా ఉండటం. భవిష్యత్తులో కూడా ఈ ఐకమత్యం కొనసాగాలనేది మూడు పార్టీల ఆకాంక్ష. అయితే పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉంటాయా లేవా అనేది ముందు ముందు తేలిపోతుంది. ఈ ఐకమత్యాన్ని దెబ్బకొట్టడం ప్రతిపక్ష వైసీపీకి అవసరం. అందుకే ప్రతిపక్ష అనుకూల మీడియా, సోషల్ మీడియాలో నిత్యం కూటమిని దెబ్బకొట్టే వార్తలు ప్రసారం చేస్తున్నారు. కానీ కూటమి నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం.
కలిసే ఉన్నాం..
అవకాశం వచ్చినప్పుడల్లా కూటమి నేతలు తమ మధ్య ఉన్న సఖ్యతను బయటపెడుతూనే ఉన్నారు. కూటమి నేతలంతా కలసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కూటమిని లీడ్ చేస్తున్న టీడీపీ కూడా అందరికీ సముచిత స్థానం ఇస్తూ పొత్తు ధర్మాన్ని పాటిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలోకి పురందరేశ్వరి స్థానంలో మాధవ్ వచ్చినా కూడా మూడు పార్టీల ఐకమత్యంలో ఎలాంటి తేడా లేదనే చెప్పాలి. తాజాగా స్త్రీ శక్తి పథకం ప్రారంభంలో ఇదే విషయం రుజువైంది. ముఖ్యంగా భావి నాయకులుగా చెబుతున్న పవన్, లోకేష్ మధ్య స్నేహం గురించి టీడీపీ పాజిటివ్ గా ప్రచారం చేసుకుంటోంది. ఈ ఇద్దరి మధ్య సఖ్యత ఉన్నన్ని రోజులు కూటమికి ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు. అటు వైసీపీ మాత్రం కూటమి కూలిపోవడం కోసం ఎదురు చూస్తోంది. పవన్ కి ప్రాధాన్యత లేదని, చంద్రబాబు చెప్పినట్టల్లా ఆయన ఆడుతున్నారంటూ విమర్శిస్తోంది. పవన్ కూడా ఈ ప్రచారాన్ని పట్టించుకోకపోవడం, అవకాశం వచ్చినప్పుడల్లా కూటమి మరో 15 ఏళ్లపాటు బలంగా ఉంటుందని చెప్పడం విశేషం.