Tirumala News: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారిని దర్శనం కోసం నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. కేవలం దర్శన భాగ్యం మాత్రమే కాకుండా సేవ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తాజాగా విద్యార్థులకు ఈనెల 16 నుంచి 19 వరకు సద్గమయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
జూన్ 16 నుంచి 19 వరకు సద్గమయ కార్యక్రమాన్ని చేపడుతోంది టీటీడీ. ఈ విషయాన్ని ఈవో శ్యామలరావు వెల్లడించారు. దీనిపై ఈవో ఛాంబర్‌లో జరిగిన సమీక్షా సమావేశానికి జేఈవో వీ వీరబ్రహ్మం, హెచ్‌డీపీపీ అధికారులు హాజరయ్యారు. టీటీడీకి చెందిన ఏడు స్కూళ్లలో విద్యార్థులకు దైవభక్తి, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత వంటి అంశాలపై ట్రైనింగ్ ఇవ్వనుంది.
దీనికోసం ఏర్పాట్లు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు ఈవో. ముఖ్యంగా భగవద్గీత సారాంశం పిల్లలకు అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. శ్రీవారి వైభవాన్ని యువత, పిల్లలకు అర్థమయయేలా శిక్షణ ఉండాలని తెలియజేశారు.
సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు సనాతన ధర్మం విలువలను తెలియజేయనుంది. పిల్లలకు తొలి దశలో ఇలాంటివి అలవాటు చేస్తే ధర్మం, విలువతో కూడిన జీవనాన్ని నేర్పినట్లు అవుతుందని భావిస్తోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని అంచనా వేసింది.
ALSO READ: సంకర జాతి కామెంట్స్.. జగన్ పై రేణుకాచౌదరి ఆగ్రహం, పార్లమెంటులో తేల్చుస్తా
చిన్న వయసు నుంచి పిల్లలకు సనాతన ధర్మం, ఉమ్మడి కుటుంబం, తల్లి, తండ్రి, గురువు, దైవము, సమాజం, దేశం గొప్పతనం గురించి తెలియజేసే అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. తిరుపతిలో ఎస్జీఎస్ హైస్కూల్, ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, ఎస్వీ హైస్కూల్, ఎస్‌కెఆర్‌ఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ , ఎస్పీ బాలికల పాఠశాల, తిరుమలలోని ఎస్వీ హైస్కూల్, తాటితోపులోని ఎస్‌కెఎస్ హైస్కూల్ విద్యార్థులకు ఆయా పాఠశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
అందులో 7,8,9 తరగతుల పిల్లలకు మాత్రమే. పిల్లలకు అవసరమైన మాడ్యూల్, లిటరేచర్ పుస్తకాలు ఇవ్వనుంది. అన్నమాచార్య, దాస సాహిత్య, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టుల్లో జరుగుతున్న కార్యక్రమాలు అలాగే స్విమ్స్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలో చర్చించారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈవో శ్యామలరావు.