Tirumala News: కలియుగ వైకుంఠం శ్రీనివాసుడి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. భక్తుల కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎక్కడో దగ్గర ఆ సమస్య వెంటాడుతూనే ఉంది. తాజాగా అలాంటి సమస్యపై కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవాణి దర్శనాల టికెట్లు జారీలో ఆలస్యమవుతుందని కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై టీటీడీ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
శ్రీవాణి దర్శనాలకు సంబంధించి తిరుమలలో కొందరు భక్తులు చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది టీటీడీ. గురువారం ఉదయం శ్రీవాణి దర్శనాలకు వచ్చిన నలుగురు భక్తులు వచ్చారు. శ్రీవాణి టికెట్ల జారీలో జాప్యం జరుగుతోందని, మంచి గదులు కేటాయించడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు. గంటల తరబడి ఉన్నా, కనీసం కూర్చోవడానికి వసతులు లేవంటూ చెప్పుకొచ్చారు.
దీనిపై ఈవోకు ఫిర్యాదు చేయాలని భావించినా కుదరలేదన్నారు. టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత రూ. 500, రూ.1000 గదులకు బదులు రూ.50 గదులు కేటాయించారని వాపోయారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. రోజు ఉదయం 8.30 గంటలకు శ్రీవాణి టికెట్లు జారీ చేస్తున్నామని తెలిపింది టీటీడీ.
టికెట్లు ఇచ్చే ముందు ఒక గంట ముందు వస్తేనే భక్తులను ఆయా కౌంటర్ వద్దకు అనుమతించడం జరుగుతుందని పేర్కొంది. సదరు భక్తులు వేకువజామున వచ్చి టికెట్ల కేటాయింపులో జాప్యం జరిగిందని ఆరోపించడం సరికాదని పేర్కొంది. సాధారణంగా శ్రీవాణి టికెట్ కౌంటర్ తెరిచే సమయానికి ముందు నుండి టీ, కాఫీ, పాలు, మజ్జిగ నిరంతరం సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది.
ALSO READ: ఏపీలో ఫస్ట్ ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’, ఇదొక గేమ్ ఛేంజర్
రూ. 50 రూపాయల గదులు తనిఖీ చేశామని, పరిశుభ్రంగానే ఉన్నాయన్నారు. టీటీడీపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం తగదని, రద్దీ నేపథ్యంలో భక్తులు సహకరించాలని సూచన చేసింది. ఈ విషయంల అసత్య ఆరోపణలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
నార్మల్‌గా తిరుమలలో గురు, శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు లేక చాలామంది భక్తులు శ్రీవాణి దర్శనాల కొరకు ఎదురుచూస్తారు. తొలి వచ్చినవారికి ముందు అనే ప్రాతిపదికలో పరిమిత సంఖ్యలో టికెట్లను ఇస్తుంది. శ్రీవాణి టికెట్లను ప్రతిరోజూ మరుసటి రోజు శ్రీవారి దర్శనం కొరకు టికెట్లను కేటాయిస్తుంది.
శ్రీవాణి టికెట్ల భక్తులు సాధారణంగా తిరుపతి నుంచి వసతి తీసుకుని వస్తుంటారు. కొంతమంది డిమాండ్ చేస్తే అందుబాటులో ఉన్న రూములను కేటాయిస్తారు. తిరుమలలో వసతి, మరుగుదొడ్లను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆరోగ్య విభాగంలోని సిబ్బంది 24 గంటలూ కృషి చేస్తారు.
భక్తుల నుంచి ఎలాంటి ఆరోపణలకు తాము ఇవ్వకుండా చర్యలు తీసుకుంటారు. వాస్తవాలు ఇలా ఉండగా.. సదరు భక్తులు ఉద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టింది. టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తోంది.