CM Chandrababu: ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. దీనికి టెక్నాలజీని జోడిస్తే ఎలా ఉంటుందని భావించారు. అనుకున్నట్లుగానే తొలిసారి కుప్పం నియోజకవర్గంలో డిజిటల్ నెర్వ్ కేంద్రం ప్రారంభించారు. ఇంతకీ డిజిటల్ నెర్వ్ కేంద్రం వల్ల ఉపయోగాలేంటి? దీన్ని గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి ఎందుకన్నారు? వాటిపై ఓ లుక్కేద్దాం.
అధికారంలోకి రాగానే తొలుత ఆరోగ్య రంగంపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. ప్రజల ఆరోగ్యాలపై ఏపీ వ్యాప్తంగా సర్వే చేయించారు. అందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో జిల్లా ఒకొక్క సమస్యతో బాధపడుతున్నారు తెలుసు కున్నారు. ఆనాటి నుంచి ఏ ప్రాంతంలో సభలు పెట్టినా, ఆరోగ్యం నుంచి పదే పదే చెబుతున్నారు.
ఆరోగ్యం రంగంలో తొలిసారి కుప్పం నుంచి ప్రయోగం మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్-టాటా సంస్థల సహకారంతో డిజిటల్ నెర్వ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇంతకీ దీని ఉద్దేశం ఏంటి? అన్నదే అసలు ప్రశ్న. డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా పీహెచ్‌సీలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను అనుసంధానం చేశారు.
రోగుల వైద్య రికార్డులు, ఆసుపత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో కలిపే ప్రక్రియ. తొలి సెంటర్ కుప్పంలో ఆవిష్కృతమైంది. దీనివల్ల ఆన్‌లైన్ ద్వారానే వైద్యుల అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. అంతేకాదు మారుమూల ప్రాంతాల్లో ఉన్నా దేశ విదేశాల్లోని వైద్య నిపుణుల సలహాలు తీసుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో ప్రారంభించారు. రెండో దశలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పూర్తికానుంది.
ALSO READ: గిరిజనులకు పవన్ కల్యాణ్ కానుక
మూడో దశలో ఏపీ అంతటా విస్తరించనుంది. వ్యక్తి గత వైద్య రికార్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండనుంది. దేశంలో అత్యధికంగా సిజేరియన్లు జరిగే తొలి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఉంది. ఈ పద్దతి ద్వారా ఔషధాలతో 50 శాతం వ్యాధిని తగ్గించవచ్చన్నారు. మరో 50 శాతం నమ్మకంతో తగ్గించవచ్చని వివరించారు సీఎం చంద్రబాబు. ఆ తరహా వైద్య సేవలకు గేమ్ ఛేంజర్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రోగ నిర్ధారణ, ఆరోగ్య సేవలు, స్క్రీనింగ్ టెస్టులు, తదుపరి అంశాలు ఫాలో అయ్యేలా డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందుతాయి. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం, ఏపీల ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని దీంతో సమన్వయం చేయనున్నారు. కుప్పంలో అమలు చేస్తున్న డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రపంచానికే నమూనాగా మారుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
వైద్య రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఆధునిక పరిజ్ఞానాన్ని అనుసంధానించనున్నారు. సాంకేతికత వినియోగం ద్వారా వ్యాధులను ముందుగా గుర్తించవచ్చు. వేగంగా చికిత్స తీసుకోవచ్చన్నారు. తద్వారా ప్రభుత్వం, ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.
ప్రస్తుతం వైద్య, ఆరోగ్య రంగానికి బడ్జెట్‌లో రూ.19,000 కోట్లు కేటాయిస్తున్నామని గుర్తు చేశారు. భవిష్యత్తులో 25 శాతానికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎం. మొత్తానికి అన్ని విభాగాల్లోకి టెక్నాలజీ ఎంటరైంది. దీనిద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు, వేగంగా అందనున్నాయి.
Transforming healthcare is at the core of our vision for Swarna Andhra. My goal is a wealthy, healthy, and happy Andhra Pradesh.
In a first for Andhra Pradesh, GoAP in collaboration with @TataCompanies, launched the Digital Nerve Centre (DiNC) in Kuppam, connecting all 13 PHCs… pic.twitter.com/AfIf3kaClo
— N Chandrababu Naidu (@ncbn) July 3, 2025