3 నెలల్లో 100 ఆవుల మరణం..
భూమన ఆరోపణలపై రాజకీయ దుమారం
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో.. వందకు పైగా ఆవులు మృతి చెందాయంటూ.. వైసీపీ నేత, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు.. రాజకీయ దుమారానికి దారితీశాయ్. చనిపోయిన గోవుల ఫోటోలను చూపిస్తూ.. గోశాలను అసమర్థ అధికారుల చేతుల్లో పెట్టారని విమర్శించారు. ఇందుకు టీటీడీ నిర్లక్ష్యం, అసమర్ధతే కారణమన్నారు. గోవులకు సరైన ఆహారం, వైద్య సౌకర్యాలు అందడం లేదని ఆరోపించారు.
గోశాలలో ఆవులు చనిపోలేదని టీటీడీ క్లారిటీ
భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణల్ని టీటీడీ తోసిపుచ్చింది. గోశాలలో ఆవులు చనిపోలేదని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు.. టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని స్పష్టం చేసింది. ఈ ప్రచారం భక్తుల మనోభావాలను గాయపరిచేందుకు.. కొందరు దురుద్దేశంతో చేస్తున్న కుట్ర అని ఆరోపించింది. భూమన ఆరోపణలకు.. టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం.. గోశాలలోని ఆవులు ఆరోగ్యంగానే ఉన్నాయని చెప్పారు.
ఆరోపణల వెనుక మాజీ అధికారి ప్రమేయం ఉందన్న భాను
టీటీడీ విజిలెన్స్ విభాగం.. ఈ విషయంపై విచారణ జరుపుతోందని తెలిపారు. అనారోగ్యం, వృద్ధాప్యం, ఇతర సమస్యల వల్ల.. ప్రతి నెలా పదుల సంఖ్యలో గోవులు మరణిస్తుంటాయన్నారు. భూమన ఆరోపణల వెనుక.. గోశాల మాజీ అధికారి ప్రమేయం ఉందని, కొద్ది నెలల కిందట జరిగిన తొక్కిసలాటలో ఆ అధికారి నిందితుడిగా ఉండటంతో.. ఆయన్ని కాపాడేందుకే.. వైసీపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ ఆరోపణల్ని ఖండించిన మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్ కూడా.. వైసీపీ ఆరోపణల్ని ఖండించారు. గోశాలపై ఇలాంటి ప్రచారం.. ఓ నీచమైన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. వైసీపీ నేతలు.. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రమేయం ఉన్న అధికారిని కాపాడేందుకే.. ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. వారికి.. హిందూ మతంపై గౌరవం లేదని విమర్శించారు. పవిత్రమైన సంస్థలపై అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని ట్వీట్ చేశారు.
తొక్కిసలాట ఘటనలో హరినాథ్ రెడ్డి సస్పెండ్
టీటీడీ గోశాలకు.. తిరుమల, తిరుపతి, పలమనేరులో ఉన్నాయి. ఎస్వీ యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న గోశాల వీటిలో పెద్దది. 2 వేల 260 ఆవులు.. ప్రస్తుతం గోశాలలో ఉన్నాయి. వీటితో పాటు గుర్రాలు, ఏనుగులు కూడా ఇక్కడే ఉంటాయ్. గోశాల నిర్వహణకు.. వెటర్నరీ అధికారిని డైరెక్టర్‌గా టీటీడీ నియమిస్తుంది. గతంలో ఇక్కడ డైరెక్టర్‌గా పనిచేసిన డాక్టర్ హరినాథ్ రెడ్డి.. 3 నెలల క్రితం జరిగిన తొక్కిసలాట ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనపై.. జ్యుడిషియల్ విచారణ కూడా సాగుతోంది. అప్పటి నుంచి టీటీడీలో డిప్యుటేషన్‌పై డిఎఫ్‌ఓగా ఉన్న ఫారెస్ట్ అధికారి శ్రీనివాసులకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.
భూమన ఆరోపణలతో గోశాలల నిర్వహణపై వివాదం
ఇద్దరు వెటర్నరీ డాక్టర్లతో పాటు కాంపౌండర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది.. ఎప్పటికప్పుడు గోవుల సంరక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఎప్పుడైతే.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. 3 నెలల్లో 100 గోవులు మరణించాయని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో.. అప్పుడే గోశాలల నిర్వహణపై వివాదం చెలరేగింది. ఆవులకు కనీసం మేత కూడా లేదని వాటి బాగోగుల్ని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గోమాతల చావులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేయడంతో.. ఈ ఇష్యూ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది.
గోవులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్న భాను ప్రకాశ్
వైసీపీ నేతలు చివరికి.. గోవులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని టీటీడీ బోర్డ్ మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి మరింత హీట్ పెంచారు. వైసీపీ హయాంలో చేసిన అక్రమాలు బయటపడతాయని.. ముందుగానే తమవారిని కాపాడుకునేందుకే.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. దాంతో.. తిరుపతిలో రాజకీయ రగడ నెలకొంది.
గోశాల వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది
వైసీపీ ఆరోపించడం.. టీటీడీ ఖండించడం వరకు ఓకే. కానీ.. టీటీడీ స్పందించిన తీరే.. ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. ఇంత పెద్ద ఆరోపణ వస్తే.. కేవలం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేసి సైలెంట్ అయిపోవడమేంటనే చర్చ జరుగుతోంది? గోశాల వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడంతో.. అసలు నిజాలు చెప్పాల్సిన బాధ్యత టీటీడీ పెద్దలపై ఉందనే టాక్ వినిపిస్తోంది.టీటీడీ సింపుల్ గా
ఓ పోస్ట్ వేసి లైట్ తీసుకుందనే అభిప్రాయం
గోశాలలో ఆవుల మరణంపై.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన చేసిన వ్యాఖ్యలపై టీటీడీ వెంటనే స్పందించింది. ఆవులు చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోలన్నీ అవాస్తవమని.. దాని వెనుక దురుద్దేశం ఉందని ప్రకటించింది. అయితే.. ఈ ఇష్యూలో భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ.. నేరుగా విమర్శించారు. కానీ.. టీటీడీ మాత్రం సింపుల్‌గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వేసి లైట్ తీసుకుందనే అభిప్రాయాలున్నాయ్. గోశాలపై వచ్చిన ఆరోపణలకు.. టీటీడీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ రాలేదని.. సీఎంవోలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయ దుమారం రేపిన అంశాన్ని.. సుతిమెత్తగా ఖండించారని.. ఎందుకు ఆరోపణల్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయారని టీటీడీ యంత్రాంగాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
భూమన ఆరోపణలపై లీగల్ గా ముందుకెళ్లాలనే ఆదేశాలు
అంతేకాదు.. భూమన ఆరోపణల్లో వాస్తవం లేనప్పుడు.. లీగల్ యాక్షన్ తీసుకుంటామని కూడా ఎందుకు చెప్పలేకపోయారని అడిగినట్లు సమాచారం. అంతేకాదు.. పక్కనే ఉన్న వెటర్నరీ యూనివర్సిటీ నుంచి ఓ సమర్థుడిని ఎంపిక చేసి.. గోశాల డైరెక్టర్‌గా ఎందుకు నియమించుకోలేకపోయారని కూడా నిలదీసినట్లు తెలుస్తోంది. గోవులతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తికి.. ఇంచార్జ్‌గా ఎలా బాధ్యతలు అప్పగిస్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముందుగా.. టీటీడీ గోశాలలోని తాజా పరిస్థితులపై సమగ్ర నివేదికను సీఎంవోకు పంపమన్నారట. అంతేకాదు.. భూమన ఆరోపణలకు దీటుగా లీగల్‌గా ముందుకెళ్లాలనే ఆదేశాలు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది.
రాజకీయంగా లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శలు
ఇదిలా ఉంటే.. టీటీడీ బోర్డ్ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ.. భూమన ఆరోపణలను ఖండించారు. మీరు గోశాలకు రండి.. అక్కడికే వెళ్లి పరిస్థితుల్ని చూద్దామంటూ చాలెంజ్ కూడా విసిరారు. దీనికి.. భూమన నుంచి ఎలాంటి స్పందన లేదు. కావాలనే.. గోశాలపై తప్పుడు ఆరోపణలు చేసి.. వైసీపీ నేతలు రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారని భాను ప్రకాశ్ రెడ్డి విమర్శించారు.
Also read: వాళ్లకు పీఏసీ పదవులా? అసలు వారు వైసీపీలో ఉన్నారా సారు!
ఆరోపణల్ని ఖండించి మంత్రి ఆనం
మరోవైపు.. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుకు కూడా భూమన ఆరోపణల్ని ఖండించారు. గోశాలలో ఆవుల రక్షణ కోసం అధికారులు నిత్యం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇక.. గత ప్రభుత్వంలో అంబానీ ఆవులను విరాళంగా ఇస్తే.. వాటిలో సగం గోవుల్ని కర్నూలులోనే దించేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాణా కొనుగోళ్లలోనూ అడ్డగోలుగా నిధుల్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వీటన్నింటికి.. భూమన కరుణాకర్ రెడ్డే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందంటున్నారు.
తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకుంటామని చెప్పలేదేం?
ఏదేమైనా.. గోవుల మరణాల ప్రచారం అసత్యమైతే.. అలాంటి ప్రచారం చేసిన వారిపై టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎందుకు చెప్పలేదనేదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలపై సమగ్రమైన విచారణ జరిపి.. దుష్ప్రచారం చేసిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. గోవుల సంరక్షణ, వైద్య సౌకర్యలు, నిర్వహణ సిబ్బంది అర్హతలపై విచారణ జరపాలంటున్నారు. మొత్తంగా.. టీటీడీ గోశాల వివాదంలో అసలు వాస్తవాలు వెలికితీయాల్సిన బాధ్యత.. టీటీడీపైనే ఉందనే చర్చ జరుగుతోంది.