Tirumala News: తిరుమల పేరు చెబితే చాలు ఎప్పుడు శ్రీవారిని దర్శించుకుంటామా? అని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సరైన సమయానికి వెళ్లలేక ఒక్కోసారి దర్శనాలు ఆలస్యం అవుతుంటాయి. తాజాగా తిరుపతి నుంచి తిరుమలకు భక్తులు వేగంగా వచ్చేలా చర్యలు తీసుకుంటోంది టీటీడీ.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజాను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు స్వయంగా వెల్లడించారు.
అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ, భద్రత పెంపు వంటి అంశాలపై అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. బుధవారం తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. పై రెండు అంశాలపై జిఎంఆర్ గ్రూప్‌కు చెందిన రాక్సా సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్‌కి ప్రస్తుతం ఎంత సమయం పడుతుంది? ఆలస్యం వల్ల వస్తున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వాహనాలు వేగంగా వెళ్లేందుకు, అలాగే లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని రాక్సా సంస్థ ప్రతినిధులకు ఈవో సూచించారు.
ALSO READ: రీల్స్ కోసమే జగన్ పర్యటన చేస్తున్నారా?
అలిపిరి చెక్ పాయింట్ వద్ద సమయాన్ని తగ్గించేందుకు పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. భక్తుల లగేజీ, వాహనాల స్కానింగ్ లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని టిటిడి విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు ఈవో. తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్‌లను నివారించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
లగేజ్ స్కానర్‌ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్లు ఏర్పాటు, ఈ ప్రక్రియను వేగవంతం చేసేలా స్కానర్‌లను పెంచాల్సిన అవసరాన్ని నొక్కి వక్కానించారు. లగేజ్ కన్వేయర్ బెల్ట్‌లను పెంచితే ఎక్కువ సమయాన్ని తగ్గించవచ్చని భావించారు. ఇక అలిపిరి టోల్ ప్లాజాలో రెండు భద్రతా లేన్‌లలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది నియామకం జరగాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం తీసుకున్న చర్యలు రాబోయే రెండు దశాబ్దాల పాటు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదనలు ఇవ్వాలని రాక్సా ప్రతినిధులను కోరారు టీటీడీ ఈవో. ఈ సమావేశంలో రాక్సా సీఈవో అమిత్ దార్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవిఎస్వో మురళీకృష్ణ, టీటీడీ అధికారులు హాజరయ్యారు.