Tirumala Updates: తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 70,457 మంది భక్తులు దర్శించుకోగా.. 22,152 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.16 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇక,
వేద విద్యా వ్యాప్తికి, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తోందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అన్నారు. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించి విశ్వవిద్యాలయ కార్యాకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్వీ వేద విశ్వవిద్యాలయాన్ని టీటీడీ 2006లో ప్రారంభించిందన్నారు. అప్పటి నుండి వేద విద్యలో ఉన్నతస్థాయి పరిశోధనలు జరిగాయన్నారు. వేద పరిశోధనలో భాగంగా వేదాల్లో ఉన్న విజ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
Also Read: Horoscope Today December 19th : ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితుల నుంచి ఆకస్మిక ధన లాభం ఉంది
త్రికోణమితి, వేదిక్ మ్యాథ్స్, ఖగోళశాస్త్రం వంటి అంశాలు వేదాల్లో ఉన్నవేనని తెలిపారు. సాధారణ ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఐఐటీ సహకారంతో ప్రాచీన భారతీయ శాస్త్రాల్లో ఉన్న విజ్ఞానాన్ని నేటి యువతకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వేద విద్య వ్యాప్తికి ఆరు వేద పాఠశాలు ప్రారంభించడం జరిగిందన్నారు. వేద విశ్వవిద్యాలయం ద్వారా వేద పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాచీన తాళ పత్ర గ్రంథాలను సేకరించి, పరిష్కరించి, డిజిటలైజేషన్ చేసేందుకు తగిన చర్యలు తీసుకుని తద్వారా వాటిని జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. భవిష్యత్తులో కూడా వేదాల్లోని సైన్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి జరుగుతుందని తెలియజేశారు.