Hari Hara Veeramallu: ప్రస్తుతం స్టార్ హీరోలు నటిస్తున్న చాలావరకు సినిమాలు పెండింగ్ ఉన్నాయి. చాలావరకు స్టార్ హీరోలు ఏడాదికి కనీసం ఒక సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేకపోతున్నారు. ఆ లిస్ట్‌లో ముందుగా పవన్ కళ్యాణ్ పేరే ఉంటుంది. రాజకీయాల్లో కూడా బిజీ అయిపోవడంతో పవన్ కళ్యాణ్‌కు అసలు సినిమాలకు టైమ్ ఇవ్వడమే కుదరడం లేదు. కానీ ఇప్పుడు తను మూడు సినిమాలను పెండింగ్ పెట్టి రాజకీయాలపై ఫోకస్ చేయడంతో తనను హీరోగా ఇష్టపడే అభిమానులు నిరాశపడుతున్నారు. ఇంతలోనే ఆయన సినిమాల్లో ఒకటైన ‘హరి హర వీరమల్లు’ గురించి ఇప్పటివరకు చాలామంది ప్రేక్షకులకు తెలియని నిజం ఒకటి బయటపడింది.
మరికొందరు తప్పుకున్నారు
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా ప్రారంభమయ్యింది. కానీ అదే సమయంలో ఏపీలో ఎన్నికలు రావడంతో పవన్ పూర్తిగా అటువైపు ఫోకస్ పెట్టారు. అలా ఈ మూవీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నా కూడా వాయిదా పడక తప్పలేదు. డేట్స్ విషయంలో తేడా రావడంతో దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత చాలాకాలం పాటు అసలు ‘హరి హర వీరమల్లు’ను డైరెక్ట్ చేసేది ఎవరు అనే క్లారిటీ ప్రేక్షకులకు రాలేదు. ఈ సినిమా నుండి క్రిష్‌తో పాటు మరెందరో టెక్నీషియన్లు కూడా తప్పుకున్నారని తాజాగా రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపడింది.
Also Read: టాలీవుడ్‌లో విషాదం.. జానపద గాయకుడు ‘బలగం’ మొగిలయ్య ఇకలేరు
నేను తప్పుకున్నాను
‘హరి హర వీరమల్లు’కు రైటర్‌గా సాయి మాధవ్ బుర్రా ఎంపికయ్యారు. ఇది మాత్రమే కాదు.. క్రిష్ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు ఆయనే రైటర్‌గా వ్యవహరించారు. అందుకే ‘హరి హర వీరమల్లు’ నుండి క్రిష్ తప్పుకున్న తర్వాత కొత్త దర్శకుడితో అనుభవం ఎలా ఉంది అని అడగగా.. క్రిష్ తప్పుకున్నప్పుడే తాను కూడా తప్పుకున్నానని బయటపెట్టారు ఈ రైటర్. ఈ విషయం ఇప్పటివరకు చాలామంది ప్రేక్షకులకు తెలియదు. ‘హరి హర వీరమల్లు’ నుండి కేవలం క్రిష్ మాత్రమే తప్పుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ సాయి మాధవ్ బుర్రా కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదని తాజాగా ఆయనే స్వయంగా ప్రకటించారు. అంతే కాకుండా ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.
గొప్ప కథ
‘‘హరి హర వీరమల్లు అద్భుతమైన సబ్జెక్ట్. అది చాలా గొప్ప సబ్జెక్ట్. ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను కూడా ఎదురుచూస్తున్నాను’’ అని తెలిపారు సాయి మాధవ్ బుర్రా. ఇప్పటివరకు ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరూ దీని గురించి గొప్పగానే చెప్తున్నారు. ఇటీవల రాజకీయాల నుండి కాస్త బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ కూడా ‘హరి హర వీరమల్లు’ చివరి షెడ్యూల్‌లో జాయిన్ అయ్యాడు. 2025 మార్చిలో ఎట్టి పరిస్థితిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ కష్టపడుతున్నారు. క్రిష్ తప్పుకున్న తర్వాత ఏఎమ్ రత్నం కుమారుడు ఏమ్ జ్యోతికృష్ణ.. ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.