TTD News: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గతంలో తిరుపతిలో టీటీడీ సర్వదర్శనం టోకెన్లను అందించేది. నేటి నుండి అదే ప్రక్రియను మళ్లీ పునః ప్రారంభిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకొనేందుకు దేశ విదేశాల నుండి భక్తులు ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం లడ్డు ప్రసాదాన్ని భక్తులు స్వీకరిస్తారు. అలాగే భక్తులకు అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాన్ని సైతం అందిస్తుంది. ఇలా నిరంతరం శ్రీవారి భక్తుల సేవలో టీటీడీ తరిస్తుందని చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో భక్తులు కొండపైకి వచ్చి టోకెన్లను తీసుకోవాల్సిన అవసరం లేకుండా, గతంలో తిరుపతిలోని పలు ప్రాంతాలలో సర్వదర్శనం టోకెన్లను అందించేవారు. నేటి నుండి అదే తరహాలో తిరుపతిలోని పలు కౌంటర్ల వద్ద ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏ రోజు కా రోజు ఎస్ఎస్డి టోకెన్లను అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.
Also Read: Railway Tracks: రైల్వేలో ముందు కొత్త ట్రాక్ వేయరు, ఎందుకో తెలుసా?
ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే భక్తులు పొందవచ్చు. మరెందుకు ఆలస్యం భక్తులకు టీటీడీ కల్పించిన సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి.
అలాగే శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. నిన్న శ్రీవారిని 62,223 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 19,704 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వార హుండీ ఆదాయం రూ.3.1 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు.