Tirumala News: అతనొక కానిస్టేబుల్. తన బాధ్యత మరిచాడో ఏమో కానీ, ఏకంగా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీనితో తిరుమల టూ టౌన్ పరిధిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ శ్రీరాముడు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
బెంగళూరుకు చెందిన పలువురు భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు. భక్తులు హరిబాబు, జగదీష్ లకు శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్లు అందజేస్తానని ఐటీబీపి కానిస్టేబుల్ చంద్రశేఖర్ వారిని సంప్రదించాడు. ఒకరికి అరకు ఎమ్మెల్యే సిఫార్సు లేఖతో బ్రేక్ దర్శనం టికెట్లు ఇప్పించేందుకు రూ. 20000, అలాగే మరొకరి వద్ద ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై 6 టికెట్లకు గాను రూ. 50,000 తీసుకున్నాడు చంద్రశేఖర్.
అయితే తమకు బ్రేక్ దర్శనం కల్పించకుండా రూ. 300 ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించడంతో భక్తులు మోసపోయినట్లు టీటీడీ విజిలెన్స్ అధికారులను సంప్రదించారు వారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా ఇలా మోసాలకు పాల్పడితే తమను సంప్రదించాలని విజిలెన్స్ అధికారులు సూచించారు. బ్రేక్ దర్శనం పేరుతో అధిక డబ్బులు వసూలు చేసిన కానిస్టేబుల్ చంద్రశేఖర్, ఇంకా ఎంత మందిని మోసం చేశారో తెలుసుకొనేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు.
కాగా ఈ విషయం తెలుసుకున్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సీరియస్ అయినట్లు సమాచారం. తాము భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తుంటే, ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఛైర్మన్ అన్నారు. ఇలా భక్తులను మోసం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ తెలిపారు.
మరి శ్రీవారి దర్శన భాగ్యం కోసం వచ్చే భక్తులు కూడా ఇటువంటి వారి పట్ల ఏదైనా సమాచారం అందితే, తమకు తెలియజేయాలని ఆయన కోరారు. మొత్తం మీద టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన సమయం నుండి టీటీడీ అధికారుల్లో కూడా మార్పు వచ్చిందని, ఏ చిన్న విషయాన్నైనా సీరియస్ గా పరిగణిస్తూ.. వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు భక్తులు తెలుపుతున్నారు.