Vande Bharat: విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కాసేపటి క్రితమే బాపట్ల జిల్లా చీరాల మండలంలో వందేభారత్ ట్రైన్ కుక్కను ఢీకొనడంతో ఎయిర్ బ్రేక్ కు అంతరాయం ఏర్పడింది. దాదాపు 27 నిమిషాల పాటు వందేభారత్ ట్రైన్ నిలిచిపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. ఘటనపై రైల్వే సిబ్బంది వెంటనే స్పందించింది. అక్కడ మృతిచెందిన కుక్కను తొలగించి లైన్ క్లియర్ చేశారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ రోజు మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న వందేభారత్ ట్రైన్ కు ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ ట్రైన్ ఎద్దును ఢీకొట్టింది. దీంతో కొద్దిసేపు ట్రైన్ నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎద్దు స్పాట్ లో చనిపోయింది. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ఎద్దును తొలగించి లైన్ క్లియర్ చేశారు. దీంతో ప్రయాణానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు.
ఈ రోజు జరిగిన ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే మార్గాల వద్ద మేతకు వచ్చే పశువులను నివారించేందుకు.. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు చెబుతున్నారు. ముఖ్యంగా వందేభారత్ లాంటి వేగవంతమైన రైళ్లకు ప్రత్యేకమైన భద్రతా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.