Vangaveeti Radha: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ.. జనసేన పార్టీలో చేరారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాన్.. వంగవీటి రాధాను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన కండువా కప్పి.. రాధాను పవన్ ఆలింగనం చేసుకున్నారు. కాపు దిగ్గజ నేత వంగవీటి రంగా కుమారుడైన రాధాకృష్ణ చేరికతో జనసేన బలం మరింత పెరిగినట్లైందని పార్టీ కార్యకర్తలు సంతోషిస్తున్నారు.
అంతకుముందు వంగవీటి రాధా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆయన్ను పవన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. అనంతరం రాధాకృష్ణ తన అనుచరులను పవన్ కళ్యాణ్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాధా వెంట వచ్చిన ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన పవన్.. వారితో ఫొటోలు సైతం దిగారు. అనంతరం పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పవన్ సూచించారు. జనసేన బలోపేతానికి కృషి చేయాలని రాధాకృష్ణకు దిశానిర్దేశం చేశారు.
Also Read: మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!
ఇదిలా ఉంటే విజయవాడ మేయర్ పదవికి వంగవీటి రాధా పోటీ చేసే అవకాశం ఉందని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయించే అవకాశముందని ఈ క్రమంలోనే ఆయన చేరిక కూడా చోటుచేసుకుందన్న ఊహాగానాలు సైతం ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానికి రాధాకృష్ణ కృషి చేశారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన.. టీడీపీతో కలిసి పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా జనసేనలో చేరడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మెుదలైంది.
Also Read: నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?