Bihar Train Theft: బిహార్లోని భాగల్పూర్ జిల్లాలో మొబైల్ దొంగతనం యత్నం తీవ్ర కలకలం రేపింది. కదులుతున్న రైలు కిటికీ నుంచి మొబైల్ లాక్కోబోయిన ఒక దొంగను ప్రయాణికులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఫ్లాట్ ఫామ్ దాటి రైలు వేగంగా ముందుకు వెళ్తున్నప్పటికీ విడిచి పెట్టలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భాగల్పూర్ జిల్లాలోని శివనారాయణపూర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ప్లాట్ఫాం నుంచి కదులుతుండగా ఓ వ్యక్తి కిటికీ గుండా ప్రయాణికుడి మొబైల్ ఫోన్ను లాక్కొనేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కోచ్లోని ప్రయాణికులు వెంటనే స్పందించి అతని చేతులను గట్టిగా పట్టుకున్నారు. రైలు వేగంగా ముందుకు కదులుతున్నప్పటికీ ప్రయాణికులు అతన్ని విడిచిపెట్టకుండా అలాగే పట్టుకోవడంతో అతను రైలు బయటి వైపు నుంచి గాల్లో వేలాడాల్సి వచ్చింది.
Shocking: At Shivnarayanpur Railway Station, a thief tried to snatch a mobile phone from a moving train and run away, but he was caught and held through the window https://t.co/Eii1vALd4u
— Ramesh Speaks (@rameshofficial0) October 12, 2026
రైలు ముందుకు కదులుతుండడంతో ఆ దొంగ ప్రాణభయంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. కాళ్లను ఫ్లాట్ ఫామ్ పై ఈడ్చుతూ పట్టు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ప్రయాణికులు వదల్లేదు. రైలు ఫ్లాట్ ఫామ్ పై కొద్ది దూరం వెళ్లిన తర్వాత.. ప్రయాణికులు ఆ వ్యక్తిని ఒక్కసారిగా వదిలిపెట్టారు. దీంతో ఆ దొంగ.. ఒక్కసారిగా ఫ్లాట్ ఫామ్ పైకి కుప్పకూలి పోయాడు. వెంటనే అక్కడున్న భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న చోరీ భయాలకు ఈ ఘటన అద్దం పడుతోందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?
ఈ వీడియో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ కదులుతున్న రైలు వెలుపల ఒక వ్యక్తిని ఇలా పట్టుకోవడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సాహసాల వల్ల ప్రయాణికులకు, అలాగే ఆ నిందితునికి కూడా తీవ్ర గాయాలు అయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. దొంగలను ఈ విధంగా ప్రాణాలకు తెగించి ఎదుర్కోవడం కంటే అప్రమత్తంగా ఉండటం మంచిదని హితవు పలుకుతున్నారు. దొంగతనం జరిగినా? అలాంటి ప్రయత్నం ఎవరైనా చేసినా వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
Also Read: యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?