Varra Ravindra Reddy Arrest : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఏకంగా ఎస్పీ స్థాయి అధికారి బదిలీకి కారణమయిన వర్రా రవీంద్రా రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. వివిధ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వర్రా రవీంద్రా రెడ్డి.. రెండు రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం, పోలీసు శాఖకు చెడ్డ పేరు వస్తుండడంతో.. నిందితుడి కోసం గట్టి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు, మహబూబ్ నగర్ మధ్యలో పోలీసులు వర్రా రవీంద్రాను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కడప స్టేషన్ కు తరలిస్తున్నారు.
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్న వారిని ఎందుకు విడిచిపెడుతున్నారంటూ.. కూటమిలోని కీలక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడం. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహించడంతో.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఓ కేసులో వర్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అరెస్ట్ చేయకుండా 41ఏ నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారు. దాంతో.. వర్రాకు అనుకూలంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏకంగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేసింది. కడప జిల్లా చిన్న చౌక్ సీఐ ను సస్పెండ్ చేసింది. దీంతో.. పోలీసు వ్యవస్థలోనూ చురుకుపుట్టింది.
కడప జిల్లా ఇన్ ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న విద్యాసాగర్ నాయుడు.. పోలీసు అధికారులతో వరుస సమావేశాలు పెట్టి, కేసును పరుగులు పెట్టించారు. వర్రా రవీంద్రా రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ఆరు బృందాలుగా ఏర్పాడి గాలింపు చేపట్టారు. కడప, కర్నూలు సహా బెంగళూరులోనూ వర్రా కోసం పోలీసులు విస్తృతంగా వెతికారు. ఓ వైపు సీఎం సీరియస్ గా ఉండడం, మరోవైపు గతంలో హోం మంత్రి వంగలపూడి అనిత సైతం బాధితురాలు కావడంతో ఈ కేసు పోలీసులకు సవాళుగా నిలిచింది.
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్న వర్రా రవీంద్రా రెడ్డి.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేనా నాయకులపై ఇష్టారీతిన పోస్టులు పెట్టారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. మహిళా నాయకులు అని కూడా చూడకుండా కామెంట్లు చేశారు. ఆఖరికి.. జగన్ సొంత చెల్లి షర్మిళ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదంటూ పోస్టు చేసి సంచలనం రేపారు. వివేకానంద హత్య కేసు తర్వాత.. సునితా పైనా సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా.. అనేక మంది నేతల ఆగ్రహానికి గురయ్యారు. అప్పట్లోనే ఓ సందర్భంలో ప్రస్తుత హోం మంత్రి వంగలపూడి అనిత మీడియా ముందుకు వచ్చి.. వర్రా రవీంద్ర రెడ్డి పోస్టులపై ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : రవీంద్రారెడ్డి రాష్ట్రాలు దాటేశాడా? కొందరి పోలీసుల సహకారం.. ఆపై వేట
జగన్ అధికారం కోల్పోయిన తర్వాత సైతం వర్రా రవీంద్రా రెడ్డి వ్యవహారం మారలేదు. గతంలో మాదిరే అసభ్యకర పోస్టులు పెడుతూ.. మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ కూటమి నేతలు వాపోయారు. వైఎస్ షర్మిళా సైతం వర్రాను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతనిపై ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్లల్లో 30కి పైగా కేసులు ఉన్నాయి.