MV MAA Ship for Visakha Tourism: షిప్ లో పెళ్లి వేడుకలు, ఇతర శుభకార్యాలు జరుపుకోవాలన్న కోరిక ఉందా? అలాగే షిప్ లో కూర్చొని తింటూ సముద్రం అందాలను తిలకించాలని ఉందా? అలాగే గ్లాసులో బీరుతో షిప్ లో నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అనుకుంటున్నారా అయితే జస్ట్ వెయిట్.. కొద్ది రోజులు ఆగండి.. ఈ కోరికలన్నీ తీరే అవకాశం రానుంది. ఔను.. ఇది నిజం. బంగ్లాదేశ్ నుండి ఒడ్డుకు వచ్చిన ఓ షిప్ ను అధికారులు.. ఇలా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్నారు.
విశాఖపట్నం లోని బీచ్ అందాలు ఎంత చూసినా తరగదు. అక్కడి బీచ్ అందాలకు ఎవరైనా ముగ్ధులు కావాల్సిందే. గుర్రపు స్వారీలు, రైడింగ్స్, ఇలా ఒకటేమిటి అక్కడ ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అందుకే విశాఖపట్నం వాసులే కాదు.. ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా వైజాగ్ బీచ్ అందాలు చూసేందుకు ఆసక్తి చూపుతారు. తాజాగా ఇదే బీచ్ లోని టెన్నేటి పార్క్ వద్ద సందర్శకులను ఆకర్షించేందుకు ఏపీ పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
2020 సంవత్సరంలో వచ్చిన తుఫాన్ ధాటికి విశాఖ నగరం గజగజ వణికింది. తుఫాన్ ధాటికి నగరంలోని కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధం కాగా, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆ తుఫాన్ సమయంలో బంగ్లాదేశ్ కు చెందిన ఎంవి మా అనే షిప్ ఒడ్డుకు చేరింది. ఈ షిప్ వైజాగ్ ఒడ్డుకు చేరిందని సమాచారం అందుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం, షిప్ ను తరలించే ప్రయత్నం చేశారు. అయితే షిప్ మరమ్మతులు పూర్తి కాకపోవడంతో, అందులోని సామాగ్రిని వారు తీసుకువెళ్ళారు. ఆ సమయం నుండి షిప్ పార్క్ వద్దనే ఉంది.
ఈ షిప్ ను ఏపీ టూరిజం శాఖ స్వాధీనం చేసుకోవాలని భావించింది. ఫిబ్రవరి 2021 లో గిల్ మెరైన్ సంస్థ నుండి టూరిజం శాఖ స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ షిప్ ను తేలియాడే రెస్టారెంట్ గా మార్చేందుకు గత వైసీపీ ప్రభుత్వం రూ. 10.5 కోట్ల అంచనాతో ఆమోదించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా, మళ్లీ షిప్ అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, తాజాగా షిప్ ను తేలియాడే రెస్టారెంట్ కంటే.. ఇదే షిప్ లో బార్, రెస్టారెంట్, ఫంక్షన్ హాల్ గా మార్చాలని భావించింది. ఈ ప్రాజెక్ట్ కు అనుమతి కోసం టూరిజం శాఖ ప్రతిపాదనలను పంపించింది.
Also Read: TTD News: భక్తుల అమాయకత్వమే ఆయుధం.. తిరుమలలో మళ్లీ మోసం.. అసలేం జరిగిందంటే?
టెన్నెటి పార్క్ వద్ద షిప్ ను అభివృద్ధి పరిస్తే చాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ వాసులు కూడా షిప్ ను త్వరగా టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. షిప్ లో కల్పించే సౌకర్యాలు కల్పిస్తే చాలు, నగరవాసులకు స్పెషల్ టూరిజం ప్లేస్ గా పార్క్ నిలుస్తుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. అయితే ప్రజల కోరిక తీరాలంటే.. మరికొన్ని నెలలు ఆగాల్సిందే అంటున్నారు టూరిజం శాఖ అధికారులు.