COVID-19 in AP: ఏపీలో తొలిసారిగా కొత్త వేరియంట్ కరోనా కేసు నమోదైంది. అయితే ప్రజలు భయాందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇంతకు ఆ జాగ్రత్తలు ఏమిటి? కోవిడ్ నుండి మనం ఎలా రక్షింపబడతామో తెలుసుకుందాం.
విశాఖ నగరంలో మళ్లీ కోవిడ్ కలకలం రేగింది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కోవిడ్ పాజిటివ్ రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ఆరోగ్య శాఖ సైతం ధృవీకరించింది. మహిళకు లేబొరేటరీ ఆధారిత RT-PCR పరీక్ష ద్వారా పాజిటివ్ తేలింది. ఆమెతోపాటు భర్త, పిల్లలకు కూడా తక్షణం పరీక్షలు నిర్వహించారు.
అప్రమత్తంగా ఉండండి.. ఆందోళన అవసరం లేదు
ఆమె కుటుంబాన్ని వైద్యులు హోం క్వారంటైన్‌లో ఉంచాలని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తత మాత్రం తప్పనిసరి అని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ సూచనలు.. కఠినంగా పాటించాలి
కోవిడ్ మళ్లీ విజృంభించకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ కొన్ని ముఖ్య సూచనలు విడుదల చేసింది. అందులో భాగంగా ప్రార్థనలు, పెళ్లిళ్లు, పార్టీలు, ఇతర సామూహిక కార్యక్రమాలను తాత్కాలికంగా ఆపాలని సూచించింది.
ప్రధాన ప్రదేశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ ప్రవర్తన తప్పనిసరి చేశారు. మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇంట్లోనే ఉండాలి.. వృద్ధులు, గర్భిణీలు
60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. అవాంఛనీయ పరిణామాలను నివారించేందుకు ఇదే సరైన మార్గమని పేర్కొంది.
శుభ్రత, మాస్క్, పరీక్షలు.. ఇవి తప్పనిసరి
చేతులు క్రమం తప్పకుండా కడుక్కోవడం, రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, ఏవైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అంతేకాకుండా విదేశాల నుండి వచ్చిన వారు కూడా తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి.
కోవిడ్ లక్షణాలు.. జాగ్రత్త వహించండి
జ్వరం, దగ్గు, అలసట, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కు కారటం, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉన్నవారు సమీప ఆరోగ్య కేంద్రాన్ని వెంటనే సంప్రదించాలని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
Also Read: Australia: 95% ఖాళీగానే ఉన్న దేశం.. అసలు అక్కడ ఏం జరుగుతోంది?
24 గంటల పరీక్షలు.. ల్యాబ్‌లు సిద్ధం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ల్యాబ్‌లలో 24/7 పరీక్షలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. మాస్కులు, PPE కిట్లు, ట్రిపుల్ లేయర్ మాస్కులు తగిన మోతాదులో స్టాక్ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం అప్రమత్తం.. ప్రజల సహకారం కీలకం
కోవిడ్ మళ్లీ రూపం మార్చుకుంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజలు కూడా సూచనలను పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుతోంది. అప్రమత్తతతోనే మళ్లీ మహమ్మారి చుట్టుముట్టకుండా అడ్డుకోవచ్చని వైద్య అధికారులు పేర్కొన్నారు