Vizag Police: పోలీసులు అంటే కేవలం నేరాలు ఆపడం మాత్రమే కాదు మానవత్వానికి కాపలాదారులుగా విశాఖ పోలీలసు నిలుస్తున్నారు. నిరుపేదలు, యాచకులు, నిరాశ్రయుల కోసం ఒక కొత్త దారిని చూపిస్తున్నారు. జ్యోతిర్గమయ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా వీధుల్లో అడుక్కుంటున్నవారికి కొత్త జీవితం ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నారు. డాక్టర్ శంకరబ్రత బాగ్చి మార్గదర్శకత్వంలో, అధికారులు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ యజ్ఞాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే వందలాది నిరాశ్రయులు రక్షించబడి, కొత్త బట్టలు, సురక్షిత నివాసం, వైద్య సహాయం పొందుతున్నారు. పలువురిని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. మరికొందరికి పనిచేయని స్థితిలో ఉన్నారో వారికి సురక్షిత ఆశ్రయం కల్పిస్తున్నారు. సమాజంలో బహిస్కరణ ఎదుర్కొన్న వారికి గౌరవమైన జీవితం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మానవ జీవన గౌరవాన్ని కాపాడటానికి విశాఖ పోలీసులు తీసుకున్న ఈ చొరవ నిజంగా ఆదర్శప్రాయమని చెప్పాలి.
రూపకల్పన పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి
దాదాపు పది నెలల క్రితం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఈ ఆలోచనను రూపకల్పన చేశారు. అయితే ఇటీవల దీన్ని అధికారికంగా ప్రారంభించారు. “వీధుల్లో అడుక్కుంటున్న లేదా నిద్రపోతున్న ప్రజలను చూడటం హృదయ విదారకంగా ఉంది. ఎవరూ మనుగడ కోసం అడగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలి” అని ఆయన స్పష్టంగా తెలిపారు. సాధారణంగా ఇలాంటి చర్యలు యాచకులను ఒకచోటు నుంచి మరొకచోటికి తరలించడమే ఆగిపోతాయి. కానీ జ్యోతిర్గమయ మాత్రం శాశ్వత పరిష్కారం వైపు దృష్టి పెట్టింది. పని చేయగలిగిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం, చేయలేని వారికి వైద్య సేవలు, ఆశ్రయం ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
Also Read: YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లు
ప్రారంభానికి ముందే పోలీసులు భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించారు. డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓల పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్, హార్బర్ సిఐ సింహాద్రి నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సిఐ తిరుపతి రావు సమన్వయంతో ఈ చర్యలు జరిగాయి. వీటిలో 243 మంది నిరుపేదలు రక్షించబడ్డారు. వారందరికీ స్నానం చేయించి, జుట్టు కట్ చేసి, కొత్త బట్టలు అందజేశారు. అందులో ఆరోగ్యంగా ఉన్న 45 మందిని కుటుంబాలతో కలిపారు. మానసిక సమస్యలతో ఉన్న తొమ్మిది మందిని ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన 189 మందిని ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆశ్రయ గృహాలకు తరలించి, నిరంతర పునరావాసం అందిస్తున్నారు.
ఈ కార్యక్రమం కోసం పోలీసులు ఎన్‌జీఓలు, స్వచ్ఛంద సేవకులు, దాతృత్వ సంఘాలు, జీవీఎమ్‌సీ, పౌరసమాజ సంస్థలతో వరుస సంప్రదింపులు జరిపారు. వాటిలో ముఖ్యంగా అసోసియేషన్ ఫర్ అర్బన్ మరియు ట్రైబల్ డెవలప్‌మెంట్ (AUTD) అనే సంస్థ 77 మందిని చూసుకోవడానికి ముందుకొచ్చి, వారికి రక్షణ కేంద్రాల్లో స్థలం ఇచ్చింది. వారిలో 11 మందిని కుటుంబాలతో కలిపారు. 66 మంది రాత్రి ఆశ్రయాల్లో ఉంటున్నారు. వీరిలో వైద్య సహాయం అవసరమైన వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అయితే నిరాశ్రయుల సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని ఆశ్రయ గృహాలు అవసరమని ఏయూటీడీ ప్రతినిధులు సూచించారు.
ఇంకా ఒక ముఖ్య అంశం ఏమిటంటే, జ్యోతిర్గమయ కేవలం యాచకులకే పరిమితం కాదు. లింగమార్పిడి వ్యక్తులు, మాజీ ఖైదీలు వంటి అణగారిన వర్గాలను కూడా ఇందులో భాగం చేస్తున్నారు. వీరికి సమాజంలో తిరిగి కలిసిపోవడానికి అవకాశాలు ఇవ్వడం, ఉపాధి కల్పించడం, గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవకాశం కల్పించడం దీని లక్ష్యం. అందువల్ల, జ్యోతిర్గమయ కేవలం పోలీసుల ప్రాజెక్టు కాదు. ఇది సమాజాన్ని మార్చే ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం.. విశాఖ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమానికి పోలీసులు ఇలా కూడా ఉంటారా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు పోలీసులు అందించే సేవలను చూసిన ప్రతి ఒక్కరు సలాం పోలీస్ అంటూ ప్రశంసిస్తున్నారు.