Vizag Updates: జూ పార్క్‌కి వెళ్ళితే సింహం గర్జన, పులి నడక, ఏనుగు కేరింతలు చూసి అలవాటు అయిపోయాం. కానీ ఈసారి మాత్రం కాస్త భిన్నంగా ఉంది. ఎప్పుడూ చూడని అతిథులు అడుగుపెట్టారు. రంగురంగుల రెక్కలు, వింత వింత శబ్దాలు చేసే పక్షులు, అరుదైన జంతువులు, మనం కేవలం పుస్తకాల్లో చూసిన క్రియేచర్లు ఇప్పుడు ప్రత్యక్షంగా విశాఖలో దర్శనమివ్వబోతున్నాయి. వీటిని చూసిన వెంటనే ఇవీ మన దగ్గరకి ఎలా వచ్చాయి? అనిపించేంత కొత్తదనాన్ని తీసుకొచ్చాయి.
జూ లోకి అడుగు పెట్టిన వెంటనే ఈ కొత్త అతిథులు మీ దృష్టిని ఆకర్షిస్తారు. కొందరి చూపులు, మరికొందరి కేరింతలను, ఇంకొందరి నడక స్టైల్ మీ మనసుని దోచేస్తాయి. చిన్నారులు ఆనందంతో ఎగిరిపడతారు, పెద్దలు ఆశ్చర్యంతో మైమరచిపోతారు. కొత్త రాకతో విశాఖ జూ ఇప్పటివరకు చూడని రేంజ్‌లో హంగులు, రంగులు పోసుకుంది. ఏం వచ్చాయో, ఎలా వచ్చాయో అనేది మీరు వెళ్లి చూసిన తర్వాతే తెలుస్తుంది.. అప్పటివరకు కాస్త సస్పెన్స్ మజా ఆస్వాదించండి.
విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ (IGZP) తరచూ కొత్త జంతువుల చేరికతో సందర్శకులకు మరింత ఆకర్షణగా మారుతోంది. తాజాగా కాన్పూర్ జూలాజికల్ పార్క్‌తో జంతువుల మార్పిడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 2న జరిగిన ఈ ఎక్స్చేంజ్‌లో భాగంగా, విశాఖ జూ పార్క్ కొత్తగా 6 జాతుల జంతువులను స్వాగతించుకుంది.
కాన్పూర్ జూ నుంచి విశాఖ జూ పార్క్‌కి వచ్చిన కొత్త అతిథుల్లో స్వాంప్ డీర్, స్ట్రైప్డ్ హైన, కామన్ సాండ్ బోవా, రెడ్-క్రౌన్‌డ్ రూఫ్ టర్టిల్, హాగ్ డీర్, కలిజ్ ఫీజెంట్, రడ్డి షెల్‌డక్, రెడ్ సాండ్ బోవా ఉన్నాయి. వీటిలో 6 జాతులు కొత్తగా విశాఖపట్నం జూ పార్క్ కలెక్షన్‌లో చేరడం విశేషం. ఈ చేరికతో జూ సందర్శకులు కొత్త రకాల జంతువులను చూడగలుగుతారు.
దీనికి ప్రతిగా, విశాఖ జూ పార్క్ నుంచి కాన్పూర్ జూ పార్క్‌కి కూడా కొన్ని జంతువులు పంపబడ్డాయి. వాటిలో ఆసియాటిక్ వైల్డ్ డాగ్, స్ట్రైప్డ్ హైన, ఇండియన్ వుఫ్, ల్యూటినో ప్యారకీట్, స్టార్ టార్టాయిస్, గ్రీన్ ఇగ్వానా, బార్కింగ్ డీర్ ఉన్నాయి. ఇలాగే రెండు జూలు పరస్పర మార్పిడి చేసుకోవడం వలన జంతువుల కలెక్షన్ పెరిగింది, అలాగే రక్త సంబంధాలు విస్తరించి, జాతుల పరిరక్షణలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ కొత్తగా వచ్చిన జంతువులను ఇప్పటివరకు క్వారంటైన్‌లో ఉంచారు. సాధారణ ప్రోటోకాల్ ప్రకారం, కొత్త ప్రదేశానికి వచ్చిన జంతువులను కొంత కాలం క్వారంటైన్‌లో ఉంచి వాటి ఆరోగ్య పరిస్థితిని పరీక్షిస్తారు. తరువాత వాటిని ప్రత్యేకంగా రూపొందించిన ఇన్క్లోజర్స్‌లో ఉంచి సందర్శకులకు చూపిస్తారు. ఈ విషయాన్ని విశాఖ జూ పార్క్ క్యూసేటర్ జి. మంగమ్మ ఒక ప్రెస్ నోట్‌లో తెలిపారు.
Also Read: Local Trains: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. 238 కొత్త రైళ్లకు సూపర్ ఫీచర్.. జర్నీ చాలా స్మార్ట్ గురూ!
ఇది మాత్రమే కాదు, విశాఖ జూ పార్క్‌లో ఇప్పటికే పలు కొత్త జాతులు పుట్టడం కూడా ఆకర్షణను మరింత పెంచుతోంది. ఈ ఏడాది మే నెలలో ఇండియన్ గ్రే వుఫ్ పిల్ల, బెంగాల్ ఫాక్స్ కబ్, రింగ్ – టైల్డ్ లీమర్ బేబీ పుట్టాయి. జూన్ నెలలో మరో రెండు జాతులు చేరాయి.. మౌస్ డీర్ ఫాన్ మరియు రెడ్-నెక్‌డ్ వాలబీ జోయ్ పుట్టి జంతుప్రదర్శనశాలకు కొత్త ఉత్సాహం తెచ్చాయి.
ప్రతిసారీ కొత్త జంతువుల చేరిక, పుట్టిన కొత్త పిల్లలు చూసి సందర్శకులు ఆనందం పొందుతుంటారు. చిన్నారులు, కుటుంబ సభ్యులు వీటిని చూడటానికి తరలివస్తారు. ఈ కొత్త చేరికలతో విశాఖ జూ పార్క్ మరింత వైవిధ్యభరితమైన జంతువుల నిలయం అవుతోంది. ముఖ్యంగా స్వాంప్ డీర్, హాగ్ డీర్ వంటి అరుదైన జాతులు ఇక్కడకు రావడం విశేషం. అలాగే రెడ్ – క్రౌన్‌డ్ రూఫ్ టర్టిల్ వంటి జాతులు సహజసిద్ధంగా అంతరించిపోతున్న తరుణంలో విశాఖ జూ వాటిని సంరక్షించడానికి సిద్ధమవుతోంది.
జూ పార్క్ సందర్శకులు ఇప్పుడు ఇంతకు ముందు చూడని కొత్త జంతువులను సమీపంగా చూడగలుగుతారు. ఇది విద్యార్థులకు కూడా సహజ శాస్త్రం మీద ఆసక్తి పెంచేలా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, అడవి జీవాల సంరక్షణపై అవగాహన పెంపొందించడానికి ఈ జంతు మార్పిడి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి.
ఇలా జంతువుల ఎక్స్చేంజ్, కొత్త పుట్టిన జాతులు కలిపి విశాఖ జూ పార్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నగరానికి వచ్చే పర్యాటకులకు ఇది తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం అవుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని అరుదైన జాతులు కూడా ఇక్కడకు రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు జూ అధికారులు.