War Between TDP and YCP over Uttarandhra Development: ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసిందెవరు? రాజధానిగా చేస్తామన్న వైసీపీ.. ఆ దిశగా పనిచేయకపోవటం వల్లే ఘోర ఓటమిని మూటగట్టుకుందా? ఉత్తారంధ్ర జిల్లాలకు కూటమి రుణపడి ఉందని.. అభివృద్ధి చేస్తామని సీఎం చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎందుకు ఉలిక్కిపడుతోంది. గత ప్రభుత్వం చేయలేనిది.. కూటమి సర్కారు చేసి చూపిస్తుందా? ఇవే అంశాలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ వర్సెస్ వైసీపీగా పరిస్థితి మారింది.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం సాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో తమ హయాంలో అభివృద్ధి సాధించిందని తెలుగుదేశం చెబుతుంటే ఉత్తారాంధ్రకు టీడీపీ చేసిందేమీ లేదని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా ఆ ప్రాంతంలో చంద్రబాబు పర్యటించటం.. కూటమికి అద్భుతవిజయం కట్టబెట్టిన మూడు జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వటంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. గత ఎన్నికల్లో తాను గెలిస్తే.. విశాఖను రాజధానిగా చేయటంతో పాటు అక్కడ నుంచే పాలన చేస్తామన్న జగన్.. ఆ ప్రాంతానికి చేసిందేమీ లేదనేది జనం మాట. రాజధాని అంటూ ప్రకటన చేశారు తప్ప.. అక్కడ అభివృద్ధి ఏదనేది టీడీపీ ఆరోపణ. కాబట్టి ఉత్తరాంధ్రపైనే ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం సాగుతోంది.
Also Read: వైఎస్‌ఆర్‌కి వారసుడివా? బీజేపీకి దాసుడివా? షర్మిల యుద్ధం
సీఎం హోదాలో తొలిజిల్లా పర్యటనను ఉత్తరాంధ్రలో సీఎం చంద్రబాబు పెట్టుకున్నారు.ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ద్వారా ప్రతి ఎకరానికీ నీరిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లికి తాగు, సాగు నీరిస్తే తన జన్మ ధన్యం అవుతుందన్నారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలనే సంకల్పంతోనే పని చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో.. ప్రజలంతా గమనించాలన్నారు. దీంతో పాటు సీఐఐ సదస్సు, మెడ్‌కో ప్రతినిధులతోనూ భేటీ అయ్యి అభివృద్ధి అంశాలు, పెట్టుబడులపై సీఎం చర్చించారు.
ఉత్తరాంధ్రపై చంద్రబాబు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్‌ను విమర్శించడంపై పెట్టిన శ్రద్ధ అభివృద్ధిపై పెట్టాలని సూచించారు. తాము ఉత్తరాంధ్ర కోసం చాలా చేశామని.. టీడీపీ నేతలు మాటలు మాని.. అభివృద్ధి చేసి చూపించాలని అన్నారు.
వైసీపీ నేతలపై విమర్శలు మాని.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను మర్చిపోయారని.. మళ్లీ అభివృద్ధి అంటూ జనంలోకి వస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా పనులు చేసి చూపించాలంటూ సవాల్ చేశారు పేర్నినాని.
Also Read: Nadendla Manohar: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మంత్రి నాదెండ్ల ప్రశంసలు
మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్‌లు మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై కౌంటరిచ్చారు బుద్దా వెంకన్న. కూటమి సర్కారు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని.. చెప్పినవన్నీ పూర్తి చేస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదు కాబట్టే.. వైసీపీని జనం తిరస్కరించారని.. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
మొత్తానికి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వైసీపీ నేతలు.. టీడీపీపై విమర్శలు చేయటం ద్వారా ఉనికి చాటుకునే యత్నాలు చేస్తున్నారని రాజకీయవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.