Weather Updates : తెలుగు రాష్ట్రంలో ఎండలు రోజురోజుకు తీవ్రం అవుతున్నాయి. క్రమంగా పెరుగుతున్న ఎండలతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. దాంతో.. చాలా మంది ఇప్పటి నుంచి ఏసీలు, కూలర్ల వినియోగానికి సిద్ధం అవుతున్నారు. పెరిగిపోయిన వేడి నుంచి తట్టుకునేందుకు కూలర్లు, ఏసీల కొనుగోళ్లు సైతం పెరిగిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఏపీలోని రాయలసీమకు మాత్రం భారత వాతావారణ శాఖ చల్లటి కబురు చెప్పింది. అత్యధిక వేడి నుంచి కాస్త ఉపశమనం కలిగేలా.. పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలకు సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం పూట అయితే బయటకు వచ్చేందుకు సైతం జనాలు కాస్త జంకుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో మొత్తంగా పొడి వాతావరణమే కనిపిస్తోంది. ఐఎమ్ డీ సైతం.. ఈ ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుందని ప్రకటించింది. అయితే.. రాయలసీమకు మాత్రం ఐఎమ్ డీ చల్లని కబురు చెప్పింది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో.. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది.
నైరుతు బంగాళాతం, తమిళనాడు తీర ప్రాంతం వరకు సగటున సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉన్నట్లు అమరావతి కేంద్రం పని చేస్తున్న వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. ఇవాళ, రేపు ఉత్తర, దక్షిణ కోస్తాలో పూర్తిగా పొడి వాతావరణం ఉండనుండగా.. 2 నుంచి 4 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ ఇవాళ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి మాత్రం పొడి వాతావరణమే ఉండనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also Read : Weather Update: మండే ఎండలు.. ఆరోజు మాత్రం మండిపోద్ది.. తస్మాత్ జాగ్రత్త
పీఠభూమి ప్రాంతంగా ఉన్న తెలంగాణలో వాతావరణం పూర్తిగా పొడిగానే ఉంటుందని వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని వెల్లడించింది. ఎండలు సైతం క్రమంగా పెరిగే అవకాశం ఉందని… కాబట్టి పగటి వేళల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లకపోవడమే మంచిదని అంటున్నారు.