రక్త తర్పణం జరగాల్సిందే..
మురారి సినిమాలో పూజారి క్యారెక్టర్ చెప్పే ఫేమస్ డైలాగ్ ఇది.
ఇప్పుడు జగన్ టూర్ కి వస్తున్నారంటే ఇదే డైలాగ్ వినపడుతోంది. ఎవరో ఒకరు కచ్చితంగా రక్త తర్పణం చేయాల్సిందే. అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనతో ఈ తంతు మొదలైంది. అక్కడ జగన్ హెలిప్యాడ్ వద్ద ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి, పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత జగన్, సత్తెనపల్లి టూర్ లో ఏకంగా ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లా పర్యటన. ఇక్కడ కూడా రక్త తర్పణం జరిగింది. ఒక వ్యక్తి తల పగిలింది. దానికి కారణం పోలీసులు అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తుంటే.. తోపులాటలో తలపగిలిందని టీడీపీ ఆరోపిస్తోంది. కారణం ఏదయినా, జగన్ పర్యటన వల్లే ఈ అనర్థం జరిగిందని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అసలు జగన్ అనే వ్యక్తి చిత్తూరుకి రాకపోయి ఉంటే ఆ కార్యకర్త తలపగిలేది కాదు కదా అంటున్నారు. జగన్ అనే వ్యక్తి సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకి వెళ్లకపోయి ఉంటే అక్కడ ముగ్గురు ప్రాణాలు పోయి ఉండవి కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
బంగారుపాళ్యం వద్ద కారు దిగేందుకు YS జగన్ ప్రయత్నం
YSRCP శ్రేణులను కొట్టారని కారు దిగేందుకు జగన్ ప్రయత్నం
గాయపడ్డ కార్యకర్త దగ్గరకు వైఎస్ జగన్ వెళ్లే ప్రయత్నం
వైఎస్ జగన్ ను కాన్వాయ్ దిగకుండా అడ్డుకున్న ఎస్పీ మణికంఠ pic.twitter.com/bQvI53mIXx
— Rahul (@2024YCP) July 9, 2025
ఎందుకీ రచ్చ..?
ఓవైపు పోలీసులు వద్దని వారిస్తున్నా జన సమీకరణకు చోటామోటా నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ పర్యటన ఓదార్పు యాత్ర లాగా కాదు, బలప్రదర్శనలా జరుగుతోందనే విమర్శలు వినపడుతున్నాయి. అధికారం పోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న జగన్, ఇలా పర్యటనల పేరుతో ప్రజల్ని, సొంత పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. పోనీ జగన్ పర్యటనల వల్ల జరిగేదేమైనా ఉంటుందా అంటే అదీ లేదు, కేవలం కూటమి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడానికే ఆయన జనంలోకి వస్తున్నారు. హడావిడి చేసి వెళ్తున్నారు. ఆయన పని బాగుంది, ఇలా కారులో వస్తారు, అలా తిరిగి బెంగళూరు వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. ఆయన కోసం వచ్చే జనాలే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
పంతం ఎందుకు..?
జగన్ చిత్తూరు జిల్లా పర్యటన విషయంలో కూడా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ పోలీసుల కళ్లుగప్పి పొలాలు, ఇతర మార్గాల ద్వారా జనాన్ని బంగారుపాళ్యంకు తరలించారు నేతలు. ఈ తరలింపులో వారు అవస్థలు పడినా, ఇంకేదైనా ప్రమాదం జరిగినా బాధ్యత ఎవరిది..? ఓవైపు పోలీసులు పర్మిషన్ లేదు అంటుంటే పంతానికి పోయి ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
పోనీ జగన్ పర్యటనకు వస్తోంది నిజంగా అభిమానులేనా అంటే పూర్తిగా అవునని చెప్పలేం. అభిమానులే వస్తే అంత హడావిడి ఉండదు. జగన్ ని చూసి సంతోషంగా తమదారిన తాము వెళ్లిపోతారు. రప్పా రప్పా నరుకుతాం అంటూ బ్యానర్లు పట్టుకుని వస్తున్నారంటే వారిని అభిమానులు కాదు, ఉన్మాదులుగా చూడాల్సి వస్తోందని టీడీపీ విమర్శిస్తోంది. జగన్ పర్యటన అంటేనే పోలీస్ కేసులు, తోపులాటలో దాడులు, చివరికి ప్రాణాలు పోవడం అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందని విమర్శిస్తున్నారు. ఇన్ని విమర్శలు వస్తున్నా ఆయన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకు వచ్చారు. రైతుల్ని పరామర్శించేందుకు వచ్చి, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు.
చిత్తూరు పై జగన్ చేస్తున్న దండయాత్రలో, డ్యూటీలో ఉన్న పోలీసుల పై రెచ్చిపోతున్న వైసీపీ ఉన్మాదులు..
పోలీసులు చెయ్యి నరికేయండి.. రప్పా రప్పా నరుకుతాం అంటూ నినాదాలు.. #YSRCPRowdyism #YcpCriminalPolitics #PsychoFekuJagan #AndhraPradesh pic.twitter.com/3jE3ceK90N— Telugu Desam Party (@JaiTDP) July 9, 2025