BRS – YCP: 2024 ఏడాది ముగింపుకు వచ్చేసింది. ఇక 2025 లోకి అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. కొత్త ఏడాది కొత్త తరహాగా ప్రారంభించాలన్నది ఆ పార్టీల ఆలోచన. అసలు 2024 ఏడాది ఆ పార్టీలకు అంతా నిరాశే మిగిల్చింది. 2024 అంటేనే అస్సలు కలిసి రాలేదు ఆ పార్టీ అధినేతలకు. అందుకే కొత్త ఏడాది లోనైనా సక్సెస్ కాగలమా అన్నది వారి భావన. ఇంతకు 2024 అంతలా చేదు అనుభవాలను మిగిల్చింది మాత్రం ఏపీలో వైసీపీకి, తెలంగాణలో బీఆర్ఎస్ కు..
ఏపీలో మొన్నటి వరకు అధికారం చెలాయించింది వైసీపీ. ఎన్నికలు వచ్చాయి. సిద్దం అంటూ సమరశంఖం పూరించింది వైసీపీ. ఆ సిద్దం ఎన్నికల సమయాన ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది వైసీపీ. 154 సీట్లతో 2019 ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైసీపీకి 2024 ఎన్నికలు శాపంగా మారాయి. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ లు తమ హవా కొనసాగించాయి. ఏకంగా 164 స్థానాలను కైవసం చేసుకొని అధికార పగ్గాలు చేపట్టాయి. ఇక జనసేన పార్టీ అయితే దక్కించుకున్న సీట్లలో విజయ కేతనం ఎగురవేయడం, వైసీపీకి అంతగా రుచించని పరిస్థితి. అందుకే 2024 ఏడాది వైసీపీకి వరాలకు బదులుగా శాపాలు అందించిందని చెప్పవచ్చు.
అందుకే కాబోలు 2025 లో ఎలాగైనా మళ్లీ పుంజుకోవాలన్న లక్ష్యంతో మాజీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారు. ఆ పావులు ఏమో కానీ, 2024 పూర్తయ్యేలోగా చాలా వరకు పార్టీ క్యాడర్ చేయి జారే పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అందుకే కొత్త ఏడాది రాకకోసం ఆ పార్టీ ఎదురు చూపుల్లో ఉంది. కొత్త ఏడాదైనా తనకు కలిసి వచ్చేలా ఉండాలన్నది వైఎస్ జగన్ అభిమతం. ఇది ఏపీ పరిస్థితి అయితే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా దక్కినా 2024 చుక్కలు చూపిందని పొలిటికల్ టాక్.
పదేళ్లు పాలన పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోగా, సీఎం గా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టారు. మళ్లీ లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం అస్సలు లేదనే చెప్పవచ్చు. ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు దక్కలేదు. ఇలా కోలుకోలేని దెబ్బ తీసింది 2024 బీఆర్ఎస్ పార్టీకి. ఈ పార్టీ కోలుకోవడం ఏమో కానీ కేసులు కొత్త తలనొప్పులు తెచ్చేలా తయారయ్యాయి బీఆర్ఎస్ కి. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడమే కాక, ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తూ, జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల చేయడం, రుణమాఫీ అమలు చేయడంతో కాంగ్రెస్ ప్రజల మనసులు చూరగొందని చెప్పవచ్చు. అయినా సరే బీఆర్ఎస్ మాత్రం తన ఉనికిని చాటుకొనేందుకు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు.
Also Read: AP Govt – TG Govt: ఆ విషయంలో తెలంగాణను ఫాలో అవుతున్న ఏపీ
కొత్త ఏడాదైనా తమకు కలిసి రావాలన్నది బీఆర్ఎస్ అధినాయకత్వం అభిమతం. కొత్త ఏడాదిలో మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేందుకు ప్లాన్ చేయగా, ఆ ప్లాన్ ఏ మేరకు ఫలిస్తుందో వేచిచూడాలి. ఇలా ఏపీలో వైసీపీకి, తెలంగాణలో బీఆర్ఎస్ కు 2024 ఏడాది కలిసి రాకపోగా, చుక్కలు చూపించిందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.