YS Jagan Comments: రాష్ట్రంలో అన్నీ అబద్దపు హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకున్న సీఎం చంద్రబాబుపై 420 కేసు పెట్టాలని మాజీ సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ అయిన సంధర్భంగా ఈ కామెంట్స్ చేశారు. ముందుగా పార్టీ నాయకులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న జగన్.. కూటమి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
జగన్ మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చారు. నేడు వాటి అమలు మరిచి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కూటమి మితిమీరిందన్నారు, ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో సీఎం చంద్రబాబు, ఎన్నికల సమయంలో ఇష్టారీతిన హామీలు గుప్పించారన్నారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదని, రాష్ట్ర పాలన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీలా మారిందని జగన్ విమర్శించారు. ఏ కార్యక్రమం అమలు చేస్తున్నా, స్కాములు తప్ప పథకాలు లేవని, ప్రజలను నట్టేట ముంచారని జగన్ అన్నారు. ప్రతి పనికి ఒకరేటు కేటాయించి అంతా దోపిడీ జరుగుతుందని, కూటమి నేతలు దండిగా దండుకుంటున్నట్లు తెలిపారు.
అంతేకాకుండ ఒక కార్యక్రమం అమలులో మాత్రం కూటమి సక్సెస్ సాధించిందని, అదే ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడంలోనంటూ జగన్ తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని కేసులు పెడతారని, అందుకు పార్టీ క్యాడర్ సిద్దంగా ఉండాలన్నారు. మరోమారు తన ప్రసంగంలో జగన్ 2.ఓ మాట లేవనెత్తారు. రానున్నది జగన్ 2.O పాలన అంటూ చెప్పిన జగన్, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ విజయం ఖాయమన్నారు. అన్యాయంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించిన అధికారులను వదిలే ప్రసక్తే లేదని జగన్ హెచ్చరించారు.
మొన్న మాజీ మంత్రి విడదల రజిని చేసిన కామెంట్స్ తగినట్లుగా జగన్ కూడ.. మరో 25 నుండి 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానన్నారు. సేమ్ టు సేమ్ కామెంట్స్ మొన్న చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును ఉద్దేశించి విడదల రజిని ఇవే కామెంట్స్ చేయడం విశేషం. ఎవరైతే తప్పు చేస్తున్నారో వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. కూటమి నేతలను ప్రజలు కాలర్ పట్టుకొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, వాటిని కూడ మనం త్వరలోనే చూస్తామన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడం, దాచుకోవడం లక్ష్యంగా కూటమి పాలన సాగుతుందని జగన్ విమర్శించారు.
Also Read: లైలా మూవీపై మాజీ మంత్రి సంచలన ట్వీట్.. పిచ్చి గొర్రెలం కాదంటూ వార్నింగ్
రాష్ట్రంలో ఇసుక, లిక్కర్ స్కామ్‌లు చేస్తున్నారని.. విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుస్తున్నాయన్నారు. పోలీసులు కూడ కూటమికి వంత పాడుతూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ప్రజలను అబద్దపు హామీలు గుప్పించి మోసం చేసిన వ్యక్తిపై 420 కేసు పెట్టాలని సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ కామెంట్స్ చేశారు. తమ పాలనలో రెండున్నర ఏళ్లు కోవిడ్ ఉందని, అందుకే కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయామంటూ వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. అన్ని జిల్లాలలో పార్టీ క్యాడర్ పోరాటాలకు సిద్దంగా ఉండాలని, ప్రజల పక్షాన పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం చేయాలని జగన్ సూచించారు. మొత్తం మీద కూటమి లక్ష్యంగా విమర్శలు చేసేందుకు జగన్ స్పీడ్ పెంచారని చెప్పవచ్చు. మరి సమీక్షలేనా? లేక త్వరలో జిల్లాల పర్యటన ఉంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.