AP Politics : నటి జెత్వానీపై వేధింపుల కేసు. అరెస్ట్ అయింది ఏ2 పీఎస్ఆర్ ఆంజనేయులు. గతంలోనే ఆయన సస్పెండ్ అయ్యారు. ఇటీవల హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేయడంతో.. లేటెస్ట్‌గా ఆయన్ను అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఇదీ కేసు. జరిగింది కూడా రోటీన్ అరెస్టే. ఇందులో పెద్ద ప్రత్యేకత ఏమీ లేదంటున్నారు. దాదాపు అన్ని కేసుల్లో వ్యవహరించినట్టుగానే జెత్వానీ కేసులోనూ ఐపీఎస్ ఆంజనేయులును అరెస్ట్ చేశారని చెబుతున్నారు. మరి, మాజీ సీఎం జగన్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అని టీడీపీ ప్రశ్నిస్తోంది.
జగన్ రియాక్షన్
YCP పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో జగన్‌మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌లో IPS అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయలను అరెస్టుపై స్పందించారు. కూటమి పాలన పరాకాష్టకు చేరిందని.. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని.. దుర్మార్గపు సంప్రదాయాలకు తెరలేపుతున్నారని తీవ్ర విమర్శలే చేశారు మాజీ సీఎం జగన్. మద్యం కేసులో మిథున్ రెడ్డిని టార్గెట్ చేసి ఇరికించాలని చూస్తున్నారన్నారు. కాలేజీ రోజుల్లో తనను ఎదురించిన పెద్దిరెడ్డిపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారని అన్నారు. కూలమి ప్రభుత్వం YCP మీద బురదజల్లి.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు.
జగన్ డైరెక్షన్‌లో ఆంజనేయులు?
ఐపీఎస్ ఆంజనేయులు.. జగన్ హయాంలో కీలక హోదాలో ఉన్నారు. ఆయన కనుసన్నల్లోనే ఈయన పనిచేసేవారని అంటారు. రఘురామ కస్టోడియల్ టార్చర్ వెనుక వ్యూహకర్త కూడా ఆ ఐపీఎస్సే అనే చెబుతారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కథ నడిపించిందీ అతనే అనే ఆరోపణ ఉంది. మొదటి నుంచీ జగన్‌కు ఆంజనేయులు అత్యంత సన్నిహితంగా ఉంటారనేది డిపార్ట్‌మెంట్‌లో ఓపెన్ సీక్రెట్. జెత్వానీతో ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు అత్యంత దారుణంగా వ్యవహరించారని స్వయంగా ఆ నటి ఆరోపించింది. ముంబై నుంచి తీసుకొచ్చి.. రహస్య ప్రదేశంలో రోజుల తరబడి బంధించి.. మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని చెబుతోంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఐపీఎస్ ఆంజనేయులు డైరెక్షన్‌లోనే ఇదంతా జరిగిందనేది కేసు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశారు.. ఇందులో తప్పుబట్టాల్సింది ఏముంది? జగన్ అంతలా రియాక్ట్ కావాల్సిన అవసరం ఏమొచ్చింది? అని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.
Also Read : నెలకు రూ.50 కోట్లు? లిక్కర్ స్కాంలో కాఫీ లాంటి కిలాడీ
ఆంజనేయులు అలాంటి వారేనా?
ఐపీఎస్ ఆంజనేయులుపై చాలాకాలం క్రితం ఓ మహిళా డాక్టర్ సైతం ఇలాంటి ఆరోపణలే చేశారు. తనను వేధిస్తున్నారంటూ.. ఓ ప్రముఖ మీడియా ఛానెల్ వేదికగా రచ్చ కెక్కారు. ఇలా ఆయనపై పలు కాంట్రవర్సీ ఆరోపణలు ఉన్నాయి. దుందుడుకు స్వభావం ఉన్న ఐపీఎస్‌గా ముద్ర ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థులపై విచ్చలవిడిగా లాఠీఛార్జ్ జరిపించారని అప్పట్లో ఆయన్ను తీవ్రంగా విమర్శించేవారు. ఇక ఏపీలో జగన్ హయాంలో ఆంజనేయులును కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారు. ఐపీఎస్‌గా ఉంటూ పూర్తిగా జగన్ కోసమే ఆయన పని చేసేవారని అంతా అంటుంటారు. అలాంటి ఆంజనేయులు అరెస్ట్ ను తప్పుబడుతూ జగన్ మాట్లాడటంలో ఆశ్చర్యం ఏముందని కూడా అంటున్నారు.
ఆంజనేయులుపై మరో కేసు..
మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారని అభియోగాలు రావడంతో గుంటూరు సీఐడీ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. కేఆర్ సూర్యనారాయణ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కోసం ఉద్యమించిన సమయంలో తనను ఐపీఎస్ ఆంజనేయులు గన్‌తో బెదిరించారని కంప్లైంట్ చేశారు.