YS Sharmila Letter to YS Jagan And Chandrababu: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత గడిచిన పదేళ్లలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మొదటి ఐదేళ్లు టీడీపీ, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా పునర్విభజన చట్టంలోని హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. జగన్, చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలో బీజీపీకి తాకట్టు పెట్టారన్నారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని అసెంబ్లీ వేదికగా చర్చించాలన్నారు. విభజన హక్కులపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని సూచించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి జాతీయ హోదా సాధించడంలో 2014 నుంచి 2019 దాకా బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు విఫలయ్యారని షర్మిల విమర్శించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ఏపీకి ఒరిగిందేమీ లేదన్నారు. హోదా కావాలని ఒకసారి, అవసరం లేదని మరోసారి మాట మారుస్తూ ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లిన జగన్, చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. ఇప్పటికైనా విభజన హామీలపై పోరాడటానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని జగన్, చంద్రబాబును కోరారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై, రాజకీయాలకు అతీతంగా, రాష్ట్రంకోసం నిలబడి, కలబడాలని పిలుపునిచ్చారు. అఖిల పక్షాన్ని తీసుకువెళ్లి ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి చేయడానికి తమతో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేసేలా కలిసికట్టుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని షర్మిల పిలుపునిచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని సూచించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని కోరుదామన్నారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలన్నారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటుతున్నా ఇంత వరకు రాజధాని నిర్మించకుండా ప్రజలకు జగన్, చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా కొత్త రాజధాని నగరాన్ని నిర్మించి తమ తప్పులను సరిచేసుకోవాలని సూచించారు.