Indian Railways: రుతుపవనాలు ముందుగానే రావడంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతుండగా, మరికొన్ని చోట్ల సాధారణ వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కొన్ని రైళ్లు రద్దు కాగా, మరికొన్ని చోట్ల ఆలస్యంగా నడుస్తున్నాయి.
ముంబైలో రైల్వే సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత
భారీ వర్షాల కారణంగా ముంబైలోని పలు రైల్వే స్టేషన్లు చెరువులను తలపిస్తున్నాయి. మసీదు స్టేషన్ లో వాన నీరు నిలిచిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వడాలా రోడ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) స్టేషన్ల మధ్య హార్బర్ లైన్ సర్వీసులను రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సెంట్రల్ రైల్వే ముంబై విభాగం వెల్లడించింది. పొగమంచు వాతావరణం, భారీ వర్షపాతం కారణంగా విజుబులిటీ తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు. మసీదు, బైకుల్లా, దాదర్, మాతుంగా, బద్లాపూర్ రైల్వే స్టేషన్లలో ట్రాక్ లలో నీళ్లు నిలిచాయి. ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలు అంతరాయం కలిగింది. ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. అటు ముంబై కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కేరళలో రైల్వే ట్రాక్ లపై విరిగిపడ్డ చెట్లు
భారీ వర్షాలకు బలమైన గాలులు తోడు కావడంతో పలు చోట్ల చెట్లు రైల్వే ట్రాక్‌లపై విరిగిపడ్డాయి. ఫలితంగా రాష్ట్రంలో రైలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. తిరువనంతపురం, పాలక్కాడ్ డివిజన్లలో వరుసగా మూడు రోజులుగా చెట్లు కూలిపోవడంతో అనేక రైళ్లు నిలిచిపోయాయి, వేలాది మంది ప్రయాణీకులు గంటల తరబడి ఆలస్యంగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. కన్నూర్ సౌత్ సమీపంలో ఒక చెట్టు పట్టాలపై పడటంతో రెండు రైల్లు ఆగిపోయాయి. కన్నూర్-మంగళూరు ప్యాసింజర్, తిరువనంతపురం-మంగళూరు ఎక్స్ ప్రెస్ నిలిచిపోయాయి. కుర్తిప్పుళ సమీపంలో ఎర్నాకుళం-వెలంకన్ని ఎక్స్ ప్రెస్ పై చెట్టు కూలి రాకపోకలకు అంతరాయం కలిగింది. కోజికోడ్‌లోనూ ఇలాంటి సంఘటన జరిగింది. మడపల్లిలో కొబ్బరి చెట్టు పట్టాలపై పడటంతో రెండు గంటల పాటు రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది. అంతరాయం కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఆలస్యంగా నడుస్తున్న రైళ్ల వివరాలు
⦿ చెన్నై-మంగళూరు మెయిల్
⦿ కోజికోడ్-షోరనూర్ ప్యాసింజర్
⦿ తిరువనంతపురం-మంగళూరు మలబార్ ఎక్స్‌ప్రెస్
⦿ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్
⦿ చెన్నై ఎగ్మోర్-గురువాయూర్ ఎక్స్‌ప్రెస్
⦿ నిజాముద్దీన్-ఎర్నాకులం మంగళా ఎక్స్‌ప్రెస్
⦿ గురువాయూర్-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్
⦿ రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్
⦿ అమృత్‌సర్-తిరువనంతపురం నార్త్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
బెంగాల్ లో నాలుగు రైళ్లు రద్దు
అటు ఆద్రా డివిజన్‌లో రోలింగ్ బ్లాక్ కారణంగా మే 26 నుంచి జూన్ 1 మధ్య వేర్వేరు తేదీల్లో బెంగాల్‌లో నాలుగు రైళ్లు రద్దు చేయబడతాయని సౌత్ ఈస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ పనుల కారణంగా నాలుగు అదనపు రైళ్లు షార్ట్ టెర్మినేషన్, షార్ట్ ఒరిజినేషన్ తో నడుస్తాయని అడ్వైజరీ పేర్కొంది.
Read Also: కాశ్మీర్ లో రైల్వే అధికారుల ఆకస్మిక తనిఖీలు, 23 మందిపై కేసు.. ఎందుకంటే?