Vijayamma Open Letter : “నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప (షర్మిళ) మేలు కోరే వారిలో నేనే మొదటి వాడిని” అవీ వైఎస్ఆర్ బతికున్నప్పుడు జగన్ మాటలు. ఇవే మాటల్ని నాలో నాతో వైఎస్ఆర్ పూస్తకంలో రాశా. కానీ ఇప్పుడు తన అనుచర నాయకులతో రోజుకొక అబద్ధం చెప్పిస్తున్నారు అంటూ విజయమ్మ లేఖాస్త్రం సంధించారు. ఆస్తుల పంపకం విషయంలో ఇప్పటి వరకు జగన్ తరఫున పార్టీ ముఖ్య నేతలు, వారి అనుకూల పత్రికల్లో అనేక కథనాలు వస్తుండగా.. తన వాదనను షర్మిళ ఒక్కరే వినిపించారు. ఇప్పుడు.. వైఎస్ విజయమ్మ ఆ కుటుంబంలో జరిగిన అనేక విషయాల్ని ప్రస్తుత లేఖ ద్వారా వెలుగులోకి తీసుకువచ్చారు.
బయట ప్రచారం జరుగుతున్నట్టుగా వైఎస్ఆర్ ఆస్తుల పంపకం జరగలేదని వైఎస్ విజయమ్మ తేల్చేశారు. ఉన్నవన్నీ కుటుంబ ఆస్తులే కావడంతో.. ఒక్కొక్కరు ఒక్కోదాన్ని చూసుకున్నారని తెలిపారు. ఆస్తులు పంచుకోవాలి అనుకున్న సమయానికి వైఎస్ఆర్ చనిపోయారని బాధపడ్డారు. అయినా… వైఎస్ఆర్ లేకుండానే పదేళ్లు అందరం కలిసున్నామన్న విజయమ్మ.. మొదటి నుంచి జగన్, షర్మిళ మధ్య సగం వాటాలే ఉండేవని గుర్తుచేశారు. మొదట్లో.. డివిడెండ్ రూపంలో షర్మిళ వాటా తీసుకున్న జగన్.. అందుకు గానూ 200 కోట్లు షర్మిళకు చెల్లించినట్లు వెల్లడించారు. MOU ప్రకారం జగన్ 60% , షర్మిళకు 40 % వాటాలు లభించాయని.. అంతకు ముందు.. చెరిసగం డివిడెండ్ తీసుకునే వారని.. అందుకు తానే ప్రత్యక్ష సాక్షిని అని వెల్లడించారు.
వైఎస్ జగన్ సీఎం అయిన రెండు నెలలకే ఆస్తుల పరంగా విడిపోదామంటూ జగన్ అడిగినట్లు గుర్తు చేసుకున్న విజయమ్మ… ఇజ్రాయిల్ లో ఈ ఘటన జరిగిందని చెప్పారు. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారని.. అందుకని విడిపోతే మంచిదని సూచించినట్లు వెల్లడించారు. ఆ మాట ప్రకారమే… విజయవాడలో ఆస్తుల పంపకాలు తన సమక్షంలో జరిగినట్లు తెలిపారు. అప్పుడు.. చాలా స్పష్టంగా ఇద్దరూ ఆస్తుల్ని విభజించుకున్నారని.. అప్పుడే MOU రాసుకున్నారన్నారు. జగనే స్వయంగా MOU రాసిచ్చారన్న విజయమ్మ.. షర్మిళకు హక్కు లేకపోతే ఎందుకు 200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారని ప్రశ్నించారు. షర్మిళకు దక్కినవి ఏవీ.. జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదన్న విజయమ్మ.. తన బాధ్యతగా ఇస్తున్నవని తేల్చారు.
వైఎస్ కుటుంబానికి చెందిన కొన్ని ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. అందులో లేని.. సరస్వతి షేర్స్ 100 %, MOU లో లేని ఎలహంక ప్రాపర్టీలో 100% షర్మిళకు ఇచ్చేందుకు జగన్ మాటిచ్చారని.. ఇప్పుడు అవి కూడా ఇవ్వకుండా షర్మిళను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల పంపకంలో షర్మిళకు అన్యాయం జరిగిందని తేల్చేసిన విజయమ్మ… తన భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, YSR ఇల్లు వంటి వాటిని కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉందని అన్నారు.
2019 వరకు కుటుంబమంతా కలిసే ఉన్నా.. తన కూతురుని బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయలేదని… అయినా తన అన్న కోసం జగన్ చెప్పినట్లే రాజకీయాల్లో చేసిందని, నిస్వార్థంగా కష్టపడిందని అన్నారు. జగన్ అధికారంలో రావడానికి షర్మిళ తీవ్రంగా కృషి చేసిందని చెప్పుకొచ్చారు. తల్లిగా తనకు ఇద్దరూ సమానమేనన్న విజయమ్మ.. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే తట్టుకోవడం కష్టంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిగా, అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన మాట్లాడటం తన విధి, ధర్మం అన్న విజయమ్మ.. షర్మిళకే తన మద్ధతు అని వెల్లడించారు.
Also Read : మీరు విమర్శిస్తోంది వైఎస్సార్ కుటుంబాన్నే.. వైసీపీ నేతలపై విజయమ్మ ఫైర్, బహిరంగ లేఖ విడుదల
జగన్ తరఫున మాట్లాడే పెద్ద మనుషులు చెబుతున్న అబద్దాల మధ్య నిజం తెలియాలనే.. తాను ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే… అయినప్పటికీ, వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు అని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే ఆస్తుల సమస్య ఉండేది కాదన్న విజయమ్మ… అసలు ఇంతటి వివాదం వచ్చేది కాదన్నారు.