ఏపీలో ఓవైపు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కక్షా రాజకీయాలు వద్దని జగన్ చెబుతున్నారు. మరోవైపు ఆ పార్టీ నేతలు మాత్రం టీడీపీని మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వైసీపీ లీగల్ సెల్ నాయకులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి టీడీపీ నేతల్ని మరింత రెచ్చగొట్టారు. ఇప్పుడు మీరు ట్రైలర్ చూపిస్తే, రేపు మేం అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తామని ఆయన అన్నారు. ఆ సినిమా ఏదో ఇప్పుడు టీడీపీ వాళ్లు చూపిస్తే వైసీపీ నేతల పరిస్థితి ఏంటనేది ఊహించగలమా..? లాయర్ గా ఉన్న పొన్నవోలు ఇలా మాట్లాడవచ్చా. టీడీపీని రెచ్చగొట్టి మరీ వైసీపీ నేతలకు చిక్కులు తెచ్చిపెట్టడం అవసరమా..? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.
వైసీపీ హయాంలో ఏం జరిగింది..?
స్వయానా అప్పటి ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సహా చాలామందిని వైసీపీ హయాంలో జైలుకి పంపించారు. ఆ కేసులు కరెక్టా, కాదా.. అనే విషయం పక్కనపెడితే చంద్రబాబు సహా టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు జైలుకెళ్లడం మాత్రం వాస్తవం. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక నమోదవుతున్న కేసులు మాత్రం కక్షసాధింపు అంటూ వైసీపీ నేతలు చెప్పడమే ఇక్కడ విడ్డూరం. 2019నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు కూటమి నేతలు చేస్తోంది కూడా కరెక్టే కదా. అప్పుడు రాజకీయ కక్షసాధింపులు ఉండబట్టే కదా, ఇప్పుడు కూడా అరెస్ట్ లు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
సినిమా చూపిస్తారా..?
2029లో వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ నేతలకు సినిమా చూపిస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ లీగల్ సెల్ నాయకుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఈ మాటల్ని టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకుంటే జరిగేదేంటి..? ఆ సినిమా ఏదో ఇప్పుడే వైసీపీ నేతలకు చూపిస్తారు కదా..? అంటే ఒకరకంగా రెచ్చగొట్టి మరీ తిప్పలు కొని తెచ్చుకోవడమే కదా..? లీగల్ సెల్ నాయకులు న్యాయపోరాటం ఎలా చేయాలా అని ఆలోచించాలి. రోజుల తరబడి రిమాండ్ ఖైదీగా జైలులో మగ్గిపోతున్న పోసానికి బెయిలిప్పించడం చేతకాలేదు కానీ, ఇలాంటి భారీ డైలాగులు నీకెందుకు పొన్నవోలు.. అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.
రైతు నాగేశ్వరరావు కోసం స్వయంగా వైయస్ జగన్ ఫోన్ చేశారు. బ్రహ్మనాయుడు గారు కార్యకర్తల కోసం పల్నాటి బ్రహ్మనాయుడిలా నిలబడ్డారు. కూటమి అరాచకత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు ప్రతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తా పోరాడతాడు.
వాళ్లు ట్రైలర్ చూపుతున్నారు..వైయస్ఆర్ కాంగ్రెస్… pic.twitter.com/Upxm0BIcOY— YSR Congress Party (@YSRCParty) March 20, 2025
ఎవరు ఔనన్నా, కాదన్నా.. కూటమి మరో నాలుగేళ్లపాటు అధికారంలో ఉంటుంది. పొరపాటున కూటమిలో పొరపొచ్చాలు వచ్చినా కూడా టీడీపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి ఢోకా ఏమీ లేదు. ఇలాంటి సమయంలో వారిని మరింతగా రెచ్చగొట్టడం వైసీపీకి తగునా అనే వాదన వినపడుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన నాయకులు చాలామంది ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ వంటి నేతలు అసలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకొచ్చిన గొడవ అనుకుంటూ పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు కూడా దూరం జరిగారు.
ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పొన్నవోలుకి జరిగే నష్టం కానీ, లాభం కానీ ఏమీ ఉండదు. ఒకవేళ టీడీపీ కన్నెర్ర చేస్తే పూర్తిగా నష్టపోయేది వైసీపీ నేతలే. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని చెడామడా తిట్టినవారే. న్యాయస్థానాల్లో పదునైన వాదనలు వినిపించి వారి తరపున పోరాడాల్సిన లీగల్ సెల్ నాయకులు ఇలా బహిరంగ సవాళ్లతో పార్టీకి మరింత నష్టం కలిగేలా చేస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తామంటూ రెచ్చిపోతున్న పొన్నవోలు, ఈ నాలుగేళ్లు టీడీపీ చూపించే సినిమాకి సిద్ధమేనా అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వినపడుతున్నాయి. మరి దీనికి వైసీపీ సమాధానం ఏంటో చూడాలి.