5 Affordable 7 Seater Cars: కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్‌లు చేయాలన్నా, పండుగలకు బంధువుల ఇళ్లకు వెళ్లాలన్నా సెవెన్ సీటర్ కార్లు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఒకే కారులో ఏడుగురు ప్రయాణించే అవకాశం ఉండటంతో వీటికి మంచి డిమాండ్ ఉంది. అయితే, ఏడు సీట్లు ఉన్న కారు కొనాలంటే ఎక్కువ బడ్జెట్ అవసరమని చాలామంది అనుకుంటారు. కానీ, భారత మార్కెట్‌లో తక్కువ ధరలోనే కొన్ని MPVలు, SUVలు అందుబాటులో ఉన్నాయి. ఈ దీపావళికి బడ్జెట్‌లో ఫ్యామిలీ కారు కొనాలనుకునేవారు ఈ ఐదు మోడళ్లను ఓసారి చెక్ చేయండి..
నిస్సాన్ గ్రావైట్ దేశంలో అందుబాటులో ఉన్న సరసమైన సెవెన్ సీటర్ కార్లలో ఒకటి. నాలుగు మీటర్ల లోపు పొడవుతో వచ్చిన ఈ MPVలో మూడు వరుసల సీట్లు ఉంటాయి. రెండో వరుసను ముందుకు, వెనక్కి జరపడంతో పాటు రిక్లైన్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అవసరం లేనప్పుడు సీట్లను మడతపెట్టి ఎక్కువ లగేజ్ తీసుకెళ్లవచ్చు. ఇందులో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే ఉంది. దీని ధర రూ.5.73 లక్షల నుంచి రూ.9.38 లక్షల వరకు ఉంటుంది.
రెనాల్ట్ ట్రైబర్ కూడా తక్కువ బడ్జెట్‌లో ఏడు సీట్లు కోరుకునేవారికి ఉపయోగపడుతుంది. ఇందులో స్థలం, సౌకర్యం, రోజువారీ అవసరాలకు తగిన ఫీచర్లపై కంపెనీ దృష్టి పెట్టింది. ఇటీవల వచ్చిన అప్‌డేట్స్‌తో పాటు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ధర రూ.5.81 లక్షల నుంచి రూ.9.20 లక్షల వరకు ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో బొలెరోకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. బలమైన బాడీ, లాడర్ ఫ్రేమ్ నిర్మాణంతో రఫ్ రోడ్ల మీద నడిచేలా తయారు చేశారు. మూడో వరుసలో సాధారణ సీట్లకు బదులుగా జంప్ సీట్లు ఉంటాయి. ఏడుగురు చక్కగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. దీని ధర రూ.8.49 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉంటుంది.
మారుతి ఎర్టిగా భారత మార్కెట్‌లో మంచి పాపులారిటీ ఉన్నఫ్యామిలీ MPV. మూడు వరుసల సీటింగ్, మంచి క్యాబిన్ స్పేస్, ప్రాక్టికల్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. పెట్రోల్‌తో పాటు CNG ఆప్షన్ కూడా ఉండటంతో కొనుగోలుదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. దీని ధర రూ.8.90 లక్షల నుంచి రూ.13.14 లక్షల వరకు ఉంటుంది.
బొలెరో నియోలో రియర్ వీల్ డ్రైవ్, డీజిల్ ఇంజిన్ ప్రత్యేకతలు. సాధారణ బొలెరోతో పోలిస్తే మరింత ఆధునికమైన డిజైన్, ఫీచర్లను అందిస్తుంది. అయితే, ఇందులోనూ మూడో వరుస జంప్ సీట్ల రూపంలో ఉంటుంది. దీని ధర రూ.9.06 లక్షల నుంచి రూ.10.85 లక్షల వరకు ఉంటుంది.
Read Also: ఈ దీపావళికి సన్ రూఫ్ కార్ కొనాలనుకుంటున్నారా? రూ.15 లక్షల లోపు 5 బెస్ట్ కార్లు ఇవే!