Ather Upcoming Scooter: ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో మరింతగా సత్తా చాటేందుకు ఏథర్ ఎనర్జీ రెడీ అవుతోంది. కంపెనీ త్వరలో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన లుక్ ను తాజాగా విడుదల చేసింది. తయారీ కేంద్రంలో అసెంబ్లీ జరుగుతున్న ఈ స్కూటర్ ఫోటోను కంపెనీ సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో కొత్త మోడల్ డిజైన్ పై స్పష్టమైన అవగాహన లభించింది. ఈ కొత్త స్కూటర్‌ను ఆగస్టు 29న జరగనున్న ఏథర్ కమ్యూనిటీ డే 2026 కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించనున్నారు. ఏథర్ రూపొందించిన కొత్త EL ప్లాట్ ఫామ్ ఆధారంగా తయారవుతున్న తొలి ప్రొడక్షన్ మోడల్ కావడం విశేషం.
గత ఏడాది ఏథర్ కమ్యూనిటీ డేలో కంపెనీ EL01 కాన్సెప్ట్ ను ప్రదర్శించింది. ఇప్పుడు విడుదలైన ఫోటో చూస్తే అదే డిజైన్‌ను చాలా వరకు కొనసాగించినట్లు తెలుస్తోంది. అయితే, కాన్సెప్ట్‌లో ఉన్న కొన్ని అంశాల స్థానంలో రోడ్లపై ఉపయోగించేందుకు అనువైన ప్రొడక్షన్ పార్ట్స్ ను అమర్చినట్లు కనిపిస్తోంది. ఈ స్కూటర్ సింపుల్, మోడ్రన్ లుక్‌తో పాటు మినిమలిస్ట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండేలా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
ఏథర్ ఇంకా పూర్తి సాంకేతిక వివరాలను వెల్లడించలేదు. అయితే ఇప్పటికే పరీక్షల సమయంలో కనిపించిన టెస్ట్ మోడళ్ల ఆధారంగా కొన్ని ఫీచర్లు బయటకు వచ్చాయి. ఈ స్కూటర్ ముందు భాగంలో 14 అంగుళాల అల్లాయ్ వీల్, వెనుక భాగంలో 12 అంగుళాల అల్లాయ్ వీల్ ఉండే అవకాశం ఉంది. ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ సెటప్‌ను అందించనున్నట్లు సమాచారం. అలాగే 7 అంగుళాల TFT డిస్‌ప్లేతో పాటు స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, కనెక్టెడ్ కార్ తరహా స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.
ఈ స్కూటర్ కు ఆధారమైన కొత్త EL ప్లాట్ ఫామ్ భవిష్యత్తులో పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి ఉపయోగపడేలా రూపొందించారు. ఇందులో 2kWh నుంచి 5kWh వరకు బ్యాటరీ ప్యాక్‌లను అమర్చే అవకాశం ఉండటంతో, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వేర్వేరు వేరియంట్లను తీసుకురావచ్చు.
ఏథర్ ఈ కొత్త స్కూటర్ తో మాస్ మార్కెట్ ను లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు కంపెనీ నుంచి వచ్చిన స్కూటర్లతో పోలిస్తే ఇది అత్యంత సరసమైన మోడల్ గా ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.1 లక్ష నుంచి రూ.1.25 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. అధికారిక ధర, పూర్తి స్పెసిఫికేషన్లు ఆగస్టు 29న జరిగే లాంచ్ కార్యక్రమంలో వెల్లడికానున్నాయి. కొత్త ప్లాట్‌ఫామ్, ఆధునిక ఫీచర్లు, అదిరిపోయే డిజైన్, అందుబాటు ధరతో ఈ స్కూటర్ భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో మంచి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.
Read Also: ఇండోనేషియా మోటార్ షోలో అదరగొట్టిన 5 కార్లు.. భారత్‌కు రాబోయేవి ఇవే!