Best Electric Scooters Under Rs.2 Lakh: పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, లోకల్ గా తిరిగే వారికి ఈ-స్కూటర్లు అనుకూలంగా మారుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో బోలెడు మోడళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, రూ.2 లక్షల లోపు బడ్జెట్‌లో కొన్ని స్కూటర్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిలో టాప్ 4 మోడల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
స్పోర్టీ లుక్, మంచి యాక్సిలరేషన్ కోరుకునే వారికి ఏథర్ 450X నచ్చుతుంది. ఈ స్కూటర్ రైడింగ్ డైనమిక్స్ కు మంచి పేరు తెచ్చుకుంది. మంచి బిల్డ్ క్వాలిటీతో పాటు స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వేరియంట్ ను బట్టి దీని ధర సుమారు రూ.1.40 లక్షల నుంచి రూ.1.55 లక్షల వరకు ఉంటుంది. కొన్ని వెర్షన్లలో 161 కిలోమీటర్ల వరకు రేంజ్ లభిస్తుంది.
రెట్రో డిజైన్ నచ్చేవారికి బజాజ్ చేతక్ అనుకూలంగా ఉంటుంది. మెటల్ బాడీ, క్లాసిక్ డిజైన్‌తో సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లకు భిన్నంగా కనిపిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు అనువైన రైడింగ్ అనుభూతితో పాటు బ్రాండ్ పై ఉన్న నమ్మకం కూడా చేతక్ కు అదనపు బలం. దీని ధర వేరియంట్‌ను బట్టి సుమారు రూ.1.15 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉంటుంది.
అదిరిపోయే టెక్నాలజీ, వేగం, రేంజ్ కోరుకునే వారికి ఓలా S1 ప్రో మరో బెస్ట్ ఆప్షన్. ఇందులో పలు స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. వేరియంట్ ను బట్టి ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, ఎక్కువ రేంజ్ లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కొన్ని వెర్షన్లు గంటకు 120 కిలోమీటర్లకు పైగా గరిష్ట వేగాన్ని అందిస్తాయి. ధర సుమారు రూ.1.30 లక్షల నుంచి రూ.1.50 లక్షల పరిధిలో ఉంటుంది.
కుటుంబ అవసరాలకు సరిపోయే సింపుల్, కంఫర్టబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకునేవారికి టీవీఎస్ ఐక్యూబ్ అనుకూలంగా ఉంటుంది. స్మూత్ రైడ్, ప్రాక్టికల్ డిజైన్, సులభమైన హ్యాండ్లింగ్ దీని ప్రధాన ఆకర్షణలు. S, ST లాంటి వేరియంట్లలో ఇది లభిస్తుంది. ధర సుమారు రూ.1.20 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఉండవచ్చు. వేరియంట్ ను బట్టి బ్యాటరీ, రేంజ్, ఫీచర్లలో మార్పులు ఉంటాయి.
రూ.2 లక్షల లోపు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటే ముందుగా మీ అవసరాలు ఎలాంటి అనేది తెలుసుకోవాలి. స్పోర్టీ రైడింగ్ కావాలంటే ఏథర్ 450X, క్లాసిక్ డిజైన్ కావాలంటే బజాజ్ చేతక్, టెక్నాలజీ, వేగం కోసం ఓలా S1 ప్రో, కుటుంబ వినియోగానికి ప్రాక్టికల్ ఆప్షన్ గా TVS iQubeను పరిశీలించవచ్చు. అయితే ధరలు, వేరియంట్లు, రేంజ్, ఆఫర్లు ప్రాంతాన్ని బట్టి మారే అవకాశం ఉంది. సో, కొనుగోలు చేసే ముందు సంబంధిత కంపెనీ అధికారిక వివరాలను పరిశీలించడం మంచిది.
Read Also: హీరో ఇంపల్స్ మళ్లీ వస్తుందా? కొత్త పేటెంట్ తో చర్చ రచ్చే!