Hero Impulse Comeback: హీరో నుంచి కొత్త డ్యూయల్ స్పోర్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ, తాజాగా ఓ కొత్త బైక్ కు డిజైన్ పేటెంట్ దాఖలు చేసింది. పేటెంట్ ఫోటోలను పరిశీలిస్తే, ఈ మోడల్ గతంలో హీరో అమ్మే ఇంపల్స్ బైక్ ను గుర్తు చేస్తోంది. దీంతో హీరో మరోసారి ఇంపల్స్ ను సరికొత్తగా తీసుకొస్తుందా? అనే చర్చ మొదలైంది.
కొత్త బైక్ డిజైన్ లో ప్రస్తుతం ఉన్న హీరో మోడళ్లకు చెందిన కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. బైక్ మొత్తం డిజైన్, ఫ్యూయల్ ట్యాంక్ ష్రౌడ్స్ పాత ఇంపల్స్ ను పోలి ఉన్నాయి. ముందు భాగంలో ఎత్తుగా ఉండే మడ్ గార్డ్, ఎత్తులో అమర్చిన ఎగ్జాస్ట్, టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ లాంటి అంశాలు డ్యూయల్ స్పోర్ట్ బైక్ లో కనిపిస్తున్నాయి.
పేటెంట్ ఫోటోస్ లో కనిపిస్తున్న ఇంజిన్ ఎయిర్ కూల్డ్ యూనిట్ గా ఉంది. దీనికి ఆయిల్ కూలర్ కనిపించడం లేదు. అందువల్ల ఇది 150 నుంచి 200cc మధ్య సామర్థ్యం కలిగిన ఇంజిన్ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం హీరో డెవలప్ చేస్తున్న XPulse 421తో పోలిస్తే ఇది చాలా చిన్న ఇంజిన్. తక్కువ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ను ఉపయోగిస్తే బైక్ బరువు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో సిటీ రోడ్లతో పాటు ఆఫ్ రోడ్ మార్గాల్లోనూ ఈజీగా నడపవచ్చు.
పేటెంట్ ఫోటోల్లో ఇంజిన్ కు కిక్ స్టార్టర్ కనిపిస్తోంది. అయితే, ఎలక్ట్రిక్ స్టార్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంజిన్ ఎడమ వైపున ఫ్యూయల్ ట్యాప్, హ్యాండిల్ బార్ పై చోక్ నాబ్ లా కనిపించే భాగాలు ఉన్నాయి. ఇవి బైక్ లో కార్బ్యురేటెడ్ ఇంజిన్ ఉండొచ్చనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి. అయితే, ప్రస్తుత ఇండియన్ ఉద్గార నిబంధనలకు కార్బ్యురేటర్ తో కూడిన కొత్త బైక్ సరిపోవడం కష్టం. అందువల్ల పేటెంట్ లో కనిపిస్తున్న వెర్షన్ ఎక్స్ పోర్ట్ మార్కెట్ల కోసం రూపొందించినది కావచ్చని భావిస్తున్నారు.
ఈ బైక్ పూర్తిగా విదేశీ మార్కెట్ల కోసమే అనుకోవాల్సిన అవసరం లేదు. పేటెంట్ చిత్రాల్లో ఫ్రంట్ నంబర్ ప్లేట్, సారీ గార్డ్ లాంటి ఇండియన్ మార్కెట్ కు అవసరమైన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో హీరో ఈ మోడల్ కు దేశం కోసం ప్రత్యేక వెర్షన్ ను సిద్ధం చేసే అవకాశం ఉంది. ఒకవేళ భారత్‌లో విడుదల చేస్తే, ఇది XPulse 200 4V, XPulse 210లకు మరో ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంటుంది. ఈ బైక్ డిజైన్ లో పాత ఇంపల్స్ పోలికలు ఉండటంతో ఆ పేరును హీరో తిరిగి ఉపయోగిస్తుందా? అనే ప్రశ్న ఆసక్తిని పెంచుతోంది. కంపెనీ ఇప్పటి వరకు పేరు, ఇంజిన్ సామర్థ్యం, ధర, విడుదల తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ బైక్‌ను EICMA 2026లో అధికారికంగా ఆవిష్కరించే అవకాశం ఉంది.
Read Also: కొత్త లుక్‌లో పల్సర్ 125, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!