EV Commercial Vehicle Sales Rise Sharply: దేశంలో భారత్ లో ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో ఈ విభాగం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన రిటైల్ అమ్మకాల గణాంకాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్ తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ (eCV) అమ్మకాలు ఏకంగా 158.2 శాతం పెరిగాయి.
సెప్టెంబర్ లో దేశవ్యాప్తంగా మొత్తం 4,188 ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాలు రిటైల్‌గా అమ్ముడయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ సంఖ్య కేవలం 1,622 యూనిట్లుగా ఉంది. అంటే, ఏడాది వ్యవధిలోనే అమ్మకాలు రెండున్నర రెట్లకు పైగా పెరిగాయి. అయితే, నెలవారీగా చూస్తే మాత్రం కొంత తగ్గుదల కనిపించింది. ఆగస్టులో 4,702 యూనిట్లు అమ్ముడవగా.. సెప్టెంబర్‌లో 4,188 యూనిట్లకు తగ్గాయి. దీంతో ఆగస్టుతో పోలిస్తే 10.9 శాతం క్షీణత నమోదైంది.
సెప్టెంబర్‌లో జరిగిన మొత్తం కమర్షియల్ వాహనాల రిటైల్ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 4.04 శాతానికి చేరింది. గత ఏడాది ఇదే నెలలో ఈ వాటా 2.16 శాతంగా ఉండేది. ఆగస్టులో 5.18 శాతంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్‌లో కొంత తగ్గింది.
కంపెనీల విషయానికి వస్తే.. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల అమ్మకాల్లో ఆధిపత్యాన్ని కొనసాగించింది. సెప్టెంబర్‌లో కంపెనీ 1,275 యూనిట్లను విక్రయించింది. గత నెలతో పోలిస్తే అమ్మకాలు 10 శాతం తగ్గినప్పటికీ.. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 103 శాతం వృద్ధి నమోదైంది. యూలర్ మోటార్స్ 1,064 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఆగస్టుతో పోలిస్తే కంపెనీ అమ్మకాలు 25.3 శాతం పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఏకంగా 1,644.3 శాతం వృద్ధి నమోదైంది.
మహీంద్రా గ్రూప్ 464 యూనిట్ల అమ్మకాలతో తర్వాతి స్థానంలో నిలిచింది. మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ అమ్మకాలు ఆగస్టుతో పోలిస్తే 28.9 శాతం, గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 68.1 శాతం పెరిగాయి. జేబీఎం ఆటో 271 యూనిట్లు విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ కంపెనీ అమ్మకాలు 1,078.3 శాతం పెరిగాయి. స్విచ్ మొబిలిటీ 261 యూనిట్లను విక్రయించగా.. ఆగస్టుతో పోలిస్తే 6.8 శాతం తగ్గినా, గత ఏడాదితో పోలిస్తే 63.1 శాతం వృద్ధి సాధించింది.
సెప్టెంబర్‌లో వీఈ కమర్షియల్ వెహికల్స్ 149 యూనిట్లు, టీవోల్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 142 యూనిట్లు అమ్మాయి. పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ సొల్యూషన్స్ 141 యూనిట్ల అమ్మకాలతో నెలవారీగా 161.1 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది. ఇక ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ అమ్మకాలు నెలవారీగా 59.1 శాతం తగ్గి 129 యూనిట్లకు చేరాయి. పినాకిల్ మొబిలిటీ సొల్యూషన్స్ 54 యూనిట్లు, ఐపీఎల్ టెక్ ఎలక్ట్రిక్ 50 యూనిట్లు, సాన్య్ హెవీ ఇండస్ట్రీ ఇండియా 38 యూనిట్లను విక్రయించాయి.
Read Also: భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!