Electric Vehicle Sales July 2026: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎక్కువ మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. తాజాగా వచ్చిన జూలై 2026 రిటైల్ అమ్మకాల లెక్కలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. గత నెలలో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన వివరాల ప్రకారం, జూలైలో దేశంలో మొత్తం 3.27 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు ఏకంగా 66 శాతం పెరిగాయి.
EV మార్కెట్ లో ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు ఈ రికార్డుకు కారణం అయ్యాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు జూలైలో తొలిసారిగా 2 లక్షల యూనిట్లను దాటాయి. ఈ సెగ్మెంట్ లో EVల మార్కెట్ వాటా కూడా పెరిగింది. జూలైలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మొత్తం టూ వీలర్స్ అమ్మకాల్లో 11.2 శాతం వాటాను సంపాదించాయి. జూన్‌లో ఇది 10.6 శాతంగా ఉండగా, గత ఏడాది జూలైలో 7.7 శాతంగా ఉంది. ఏడాది కాలంలో వినియోగదారుల ఆసక్తి ఎంతగా మారిందో ఈ లెక్కలు చెప్తున్నాయి.
ఎలక్ట్రిక్ త్రీ వీలర్ విభాగంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. జూలైలో ఈ సెల్మెంట్ లో జరిగిన మొత్తం రిటైల్ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా ఏకంగా 65.1 శాతానికి చేరుకుంది. జూన్‌లో ఈ వాటా 62.7 శాతంగా ఉండగా, గత ఏడాది ఇదే సమయంలో 60.3 శాతంగా ఉంది. అంటే త్రిచక్ర వాహనాల్లో ఎలక్ట్రిక్ మోడళ్లు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కాకుండా ప్రధాన ఎంపికగా మారుతున్నాయి.
ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా జూలైలో మంచి దూకుడు కొనసాగించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ విభాగంలో రిటైల్ అమ్మకాలు 83 శాతం పెరిగాయి. EV కార్ల మార్కెట్ వాటా 7.9 శాతంగా నమోదైంది. అయితే డిమాండ్‌కు అనుగుణంగా కొన్ని ప్రముఖ EV మోడళ్ల సరఫరా లేకపోవడం వృద్ధికి అడ్డంకిగా మారుతోందని FADA తెలిపింది. ముఖ్యంగా పండుగల సీజన్ ప్రారంభానికి ముందే సరఫరా సమస్యలను పరిష్కరించాలని వాహన తయారీ సంస్థలను కోరింది.
కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లోనూ ఎలక్ట్రిక్ వాహనాల వాటా భారీగా పెరిగింది. జూలైలో ఇది 3.57 శాతానికి చేరుకుంది. గత ఏడాది జూలైలో నమోదైన 1.65 శాతంతో పోలిస్తే ఇది రెండింతలకు పైగా పెరిగింది. ఫ్లీట్ ఆపరేటర్లు చిన్న స్థాయి EV ప్రయోగాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలను కొనుగోలు చేసే దిశగా వెళ్తుండటం ఈ వృద్ధికి కారణమని FADA తెలిపింది.
Read Also: కియా To హ్యుందాయ్.. ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న 5 క్రేజీ కార్లు ఇవే!