Global EV Efficiency Rankings: భారత ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్ పోర్టేషన్ విడుదల చేసిన గ్లోబల్ ఆటోమేకర్ రేటింగ్స్ 2025లో టాటా మోటార్స్, మహీంద్రా ప్రపంచంలోనే అత్యంత బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఈవీ తయారీ సంస్థలుగా నిలిచాయి. ఈ జాబితాలో టెస్లా, బీవైడీ లాంటి అంతర్జాతీయ దిగ్గజాలను కూడా భారతీయ కంపెనీలు వెనక్కి నెట్టాయి.
ఈ నివేదికలో ప్రపంచంలోని 22 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలను పరిశీలించారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు, తయారీ ప్రక్రియలో కార్బన్ ఉద్గారాల తగ్గింపు, భవిష్యత్ ఈవీ టెక్నాలజీనిక అనుకూలంగా ఉండటం, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల సామర్థ్యం లాంటి పలు అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇందులో ఇంధన సామర్థ్యం విభాగంలో టాటా మోటార్స్ మొదటి స్థానాన్ని, మహీంద్రా రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి.
టాటా మోటార్స్ వాహనాల సగటు విద్యుత్ వినియోగం 106 Wh/km మాత్రమే. అంటే ఒక కిలోమీటర్ ప్రయాణించడానికి ఇతర కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువ విద్యుత్ అవసరమవుతుంది. మహీంద్రా వాహనాల వినియోగం 113 Wh/kmగా నమోదైంది. ఈ రెండు గణాంకాలు ప్రపంచ సగటు 131 Wh/km కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. విద్యుత్ వినియోగం తక్కువగా ఉండటం వల్ల బ్యాటరీ శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. దీంతో వినియోగదారులకు ఛార్జింగ్ ఖర్చులు తగ్గడంతో పాటు వెహికల్ మరింత సమర్థంగా పనిచేస్తుంది. ఈ కారణంతోనే టాటా, మహీంద్రా కంపెనీలు ఈ విభాగంలో టెస్లా, బీవైడీ లాంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లను వెనక్కి నెట్టాయి.
ఇండియన్ ఈవీ కంపెనీల సక్సెస్ కు మరో ప్రధాన కారణం వాటి మోడల్స్ రూపకల్పనేనని నివేదిక వెల్లడించింది. చాలా విదేశీ కంపెనీలు భారీ ఎస్‌యూవీలు, లగ్జరీ సెడాన్లపై దృష్టి పెడుతుంటే, టాటా, మహీంద్రా మాత్రం తక్కువ బరువున్న క్రాస్ ఓవర్ వెహికల్స్ ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి రోజువారీ వినియోగానికి అనువుగా ఉండటంతో పాటు తక్కువ విద్యుత్ వినియోగించేలా తయారయ్యాయి. ఇటీవల విడుదలైన టాటా సియెర్రా ఈవీ, మహీంద్రా బీఈ 6 లాంటి మోడళ్లలో కూడా ఇదే విధానాన్ని ఫాలో అయ్యారు. పెద్ద బ్యాటరీల కంటే తక్కువ విద్యుత్ వినియోగం, మెరుగైన సామర్థ్యంపై దృష్టి పెట్టడంతో ఈ వాహనాలు మంచి ఫలితాలు సాధించాయని నివేదిక వెల్లడించింది. విద్యుత్ వినియోగంలో టాటా, మహీంద్రా ముందంజలో ఉన్నప్పటికీ, వేగవంతమైన ఛార్జింగ్, ఎక్కువ రేంజ్ లాంటి అంశాల్లో ఇంకా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం భారతదేశంలో కొత్తగా అమ్ముడవుతున్న ప్యాసింజర్ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 5 శాతం కంటే తక్కువగా ఉంది. అయితే ప్రపంచ సగటు సుమారు 25 శాతంగా ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2030 నాటికి దేశంలో కొత్త వాహనాల అమ్మకాలలో ఈవీల వాటాను 30 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: టాటా To కియా.. రూ.20 లక్షల్లోపు బెస్ట్ సౌండ్ సిస్టమ్ కార్లు ఇవే!