2026 Mahindra Scorpio N Launch: మహీంద్రా స్కార్పియో N ఎస్‌యూవీకి ఫేస్ లిఫ్ట్ వెర్షన్ త్వరలో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను పరిచయం చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈసారి కూడా ఆగస్టు 15న స్కార్పియో N ఫేస్ లిఫ్ట్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లీకైన ఫొటోలు, సమాచారం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈ ఫేస్ లిఫ్ట్ లో పూర్తిగా కొత్త మోడల్ ను కాకుండా, ప్రస్తుతం ఉన్న స్కార్పియో Nకు కొన్ని డిజైన్, ఫీచర్ అప్‌డేట్లు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా క్యాబిన్ ను మరింత ప్రీమియంగా మార్చడంపై మహీంద్రా దృష్టి పెట్టింది.
స్కార్పియో N బాహ్య డిజైన్ లో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న బోల్డ్, మస్కులర్ లుక్ ను అలాగే కొనసాగిస్తూ, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, కొత్త కలర్ ఆప్షన్ లాంటి చిన్న మార్పులు మాత్రమే ఉండొచ్చని అంచనా. అయితే, క్యాబిన్ లో మాత్రం పలు కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. లీకైన ఫోటోల ప్రకారం కొత్త డ్యాష్ బోర్డ్ డిజైన్ తో పాటు 10.25 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టాప్ వేరియంట్లలో సింగిల్ సన్ రూఫ్ స్థానంలో పనోరమిక్ సన్ రూఫ్ ను అందించే అవకాశం ఉంది. కొత్త ఏసీ వెంట్స్, మెరుగైన ఇంటీరియర్ ఫినిష్ తో క్యాబిన్ మరింత ప్రీమియంగా కనిపించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఈ ఫేస్ లిఫ్ట్ లో డిజైన్, ఫీచర్లలో మార్పులు ఉన్నప్పటికీ ఇంజిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు ఉండవని భావిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 203 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 175 PS పవర్‌ను అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లతో పాటు 6 స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికలు కొనసాగనున్నాయి. డీజిల్ వేరియంట్ లో రియర్ వీల్ డ్రైవ్ తో పాటు ఫోర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ను ఆగస్టు 15న అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. అదే రోజు బుకింగ్స్, అమ్మకాలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఫీచర్లు యాడ్ చేయడం వల్ల ప్రస్తుత మోడల్ తో పోలిస్తే ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెరగవచ్చని అంచనా. ప్రారంభ ధర సుమారు రూ.14 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ఉండే అవకాశం ఉంది.
Read Also: తక్కువ ధరలో క్రేజీ ఏథర్ స్కూటర్.. లాంచ్ కు ముందే లుక్ రివీల్!