Mahindra XUV 3XO CNG: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్ లో కాంపాక్ట్ SUVలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మహీంద్రా తన XUV 3XO మోడల్‌లో కొత్త CNG వేరియంట్ ను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. అక్టోబర్ 15న ఈ కొత్త SUVని ఆవిష్కరించనుంది. లాంచ్‌కు ముందు కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో కారు ఎక్స్ టీరియర్, ఇంటీరియర్‌కు సంబంధించిన కొన్ని వివరాలను చూపించింది. పనోరమిక్ సన్ రూఫ్, కొత్త ఫ్రంట్ డిజైన్ ఈ టీజర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రస్తుతం మహీంద్రా XUV 3XO పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ లోనూ అందుబాటులో ఉంది. ఇప్పుడు CNG వేరియంట్ ను తీసుకురావడం ద్వారా మరింత మంది కొనుగోలుదారులను ఆకట్టుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ మోడల్ మార్కెట్లోకి వస్తే, CNG ఆప్షన్ తో లభించే కాంపాక్ట్ SUVల విభాగంలో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. అయితే, కొత్త వేరియంట్ ధర, వేరియంట్ల వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
XUV 3XO CNGలో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు CNG సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పెట్రోల్ వెర్షన్‌లో ఈ ఇంజిన్ 111hp పవర్, 200Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, CNG మోడ్ లో పవర్, టార్క్ గణాంకాలు మారే అవకాశం ఉంటుంది. పెట్రోల్ మోడల్ లో 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. CNG వేరియంట్‌లో ఏ ట్రాన్స్ మిషన్ అందిస్తారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. CNG ట్యాంక్ సామర్థ్యం, దాని ప్లేస్ మెంట్ లాంటి వివరాలు కూడా అధికారిక ప్రకటన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.
కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో XUV 3XO ముందు భాగంలో బాడీ కలర్ ప్యానెల్, మహీంద్రా ట్విన్ పీక్స్ లోగోకు ఇరువైపులా మెటాలిక్ ఇన్‌సర్ట్స్ కనిపిస్తున్నాయి. క్లోజ్డ్ గ్రిల్ తరహా డిజైన్ మహీంద్రా RevX వేరియంట్లను పోలి ఉంది. దీంతో CNG వేరియంట్‌ను కూడా ఈ డిజైన్‌తో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్‌ను టీజర్ ద్వారా చూపించారు. మిగతా ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో సాధారణ XUV 3XOతో పోలిస్తే పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
మహీంద్రా XUV 3XO CNGని అక్టోబర్ 15న ఆవిష్కరించనుంది. ధర, పూర్తి ఫీచర్లు, CNG మైలేజీ, బుకింగ్స్ లాంటి వివరాలపై అధికారిక ప్రకటన కోసం కొనుగోలుదారులు ఎదురుచూడాలి. CNG వేరియంట్ అందుబాటులోకి వస్తే, పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే SUV కొనుగోలుదారులకు మరో ఆప్షన్ లభించనుంది.
Read Also: టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ టీజ్.. కొత్త లుక్ తో అదిరిపోయే ఎంట్రీ!