Maruti Dzire Back at No.1 in July 2026: భారత్‌లో SUVలు, కాంపాక్ట్ SUVలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయినప్పటికీ, సెడాన్ అయిన మారుతి సుజుకి డిజైర్ తన సత్తా చాటింది. జూలై 2026లో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ నెలలో మొత్తం 23,791 యూనిట్ల డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి.
జూలై అమ్మకాలలో డిజైర్, మారుతి సుజుకి వాగన్ ఆర్ ను స్వల్ప తేడాతో వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని దక్కించుకుంది. SUVల వైపు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. డిజైర్ టాప్ లో నిలవడం విశేషం. అంతేకాదు, జూలైలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్లలో మారుతి సుజుకికి చెందిన ఆరు మోడళ్లు చోటు దక్కించుకున్నాయి. డిజైర్ నెంబర్ వన్ గా నిలిచేందుకు ఇంధన సామర్థ్యం, లో మెయింటెనెన్స్ ఖర్చులు, సరసమైన ధరలు కారణమయ్యాయి. రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడే కారు కోసం చూసే కుటుంబాలు, ఉద్యోగులు, ట్యాక్సీ, ఫ్లీట్ ఆపరేటర్లకు డిజైర్ ప్రాక్టికల్ ఆప్షన్‌గా కొనసాగుతోంది.
డిజైర్ అమ్మకాలు ప్రతి నెలా ఒకే స్థాయిలో ఉండకపోయినా, మొత్తం మీద ఈ సెడాన్‌కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 2026 మేలో 24,546 యూనిట్ల అమ్మకాలతో డిజైర్ మొదటి స్థానంలో నిలిచింది. జూన్‌లో మాత్రం 17,899 యూనిట్లతో మూడో స్థానానికి పడిపోయింది. ఆ నెలలో టాటా పంచ్, టాటా నెక్సాన్ డిజైర్ కంటే ముందున్నాయి. అయితే జూలైలో మళ్లీ అమ్మకాలు భారీగా పెరిగాయి. 23,791 యూనిట్లతో తిరిగి నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. అంటే, కేవలం మూడు నెలల వ్యవధిలోనే డిజైర్ రెండుసార్లు దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. FY2026 మొత్తం అమ్మకాల పరంగా కూడా డిజైర్ మంచి ప్రదర్శన కనబరిచింది. ఆర్థిక సంవత్సరంలో సుమారు 2.3 లక్షల యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచినట్లు సమాచారం.
డిజైర్ సక్సెస్ కు మైలేజీ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. లేటెస్ట్ జనరేషన్ డిజైర్ లో 1.2 లీటర్, మూడు సిలిండర్ల Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. మాన్యువల్ గేర్ బాక్స్ తో 24.79kmpl, ఐదు స్పీడ్ AMTతో 25.71kmpl మైలేజీని కంపెనీ వెల్లడించింది. ఇంధన ఖర్చును మరింత తగ్గించుకోవాలనుకునే వారికి CNG వెర్షన్ కూడా ఉంది. ఇది 33.73km/kg వరకు మైలేజీ ఇస్తుంది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి డిజైర్ బెస్ట్ ఆప్షన్ గా మారింది.
న్యూ జెనరేషన్ డిజైర్ డిజైన్ లో కూడా మార్పులు వచ్చాయి. రీడిజైన్ చేసిన గ్రిల్, LED హెడ్ ల్యాంప్ లతో కారు మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది. లోపల 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే లాంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. డిజైర్‌కు భద్రత విషయంలో కూడా మంచి గుర్తింపు లభించింది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABSతో EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
Read Also: ఆటోమేటిక్ కారు కొనాలా? రూ.10 లక్షల్లో బెస్ట్ 10 కార్లు ఇవే!