Maruti Suzuki eWX Electric Car: ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి eWX ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు క్రేజీగా ఆకట్టుకుంటుంది. బాక్సీ డిజైన్, చిన్న సైజు, సిటీ డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉండేలా రూపొందించిన ఈ కారు.. భవిష్యత్తులో మారుతి వాగన్ ఆర్ ఎలక్ట్రిక్ వెర్షన్ కు ముందస్తు మోడల్ గా భావిస్తున్నారు.
మారుతి సుజుకి eWX ప్రత్యేకత దాని డిజైన్. సాధారణ హ్యాచ్ బ్యాక్ కార్లతో పోలిస్తే ఎత్తుగా, టాల్‌బాయ్ స్టైల్‌ను ఇందులో ఉపయోగించారు. చిన్న రోడ్లపై సులభంగా నడపడానికి, సిటీ ట్రాఫిక్ లో సౌకర్యంగా ప్రయాణించడానికి ఈ డిజైన్ ఉపయోగపడుతుంది. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, C ఆకారపు LED లైట్లు, బాడీపై పసుపు రంగు యాక్సెంట్లు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. వీల్స్ పై కూడా పసుపు రంగు డిజైన్ ఎలిమెంట్స్ ఉండటంతో కారుకు మోడ్రన్ లుక్ లో ఆకట్టుకుంటుంది.
కారు లోపలి భాగంలో కూడా లేటెస్ట్ డిజైన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. డ్రైవర్‌కు అవసరమైన సమాచారం సులభంగా కనిపించేలా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌ను కలిపిన డిజైన్‌ను చూపించారు. టూ స్పోక్ స్టీరింగ్ వీల్, ఓపెన్ సెంటర్ కన్సోల్ లాంటి ఫీచర్లు ఇంటీరియర్‌ను మరింత క్రేజీగా మార్చుతున్నాయి. కారు బయటకు చిన్నగా కనిపించినప్పటికీ, ఎత్తైన బాడీ డిజైన్ కారణంగా లోపల కూర్చునే వారికి చక్కటి హెడ్‌రూమ్ లభించనుంది. అయితే, ప్రొడక్షన్ మోడల్‌లో ఇవే ఫీచర్లు ఉంటాయా? క్యాబిన్ స్పేస్ ఎంత ఉంటుంది? అనేది అధికారిక వివరాలు వెల్లడైన తర్వాతే తెలుస్తాయి.
మారుతి సుజుకి eWX కాన్సెప్ట్ కారు రేంజ్‌పై కూడా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 230 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించవచ్చని తెలుస్తోంది. ఈ రేంజ్ పట్టణ ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలు చేసే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆఫీసులకు వెళ్లేవారు, షాపింగ్ కోసం కారును ఉపయోగించేవారు, చిన్న దూరాలకు తరచుగా ప్రయాణించేవారిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కార్లను రూపొందిస్తున్నారు. అయితే, eWXకు సంబంధించిన బ్యాటరీ సామర్థ్యం, అధికారిక డ్రైవింగ్ రేంజ్, ఛార్జింగ్ సమయం లాంటి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.
ఈ ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ.8.5 లక్షల ఎక్స్ షోరూమ్ నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. 2026లో ఉత్పత్తి ప్రారంభమవుతుందనే ప్రచారం ఉన్నప్పటికీ, eWXకు సంబంధించిన ఖచ్చితమైన లాంచ్ తేదీ, ప్రొడక్షన్ వివరాలను కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ, సిట్రోయెన్ eC3 లాంటి మోడళ్లతో ఈ కారు పోటీపడే అవకాశం ఉంది.
Read Also: లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!