Maruti Suzuki Hikes Nexa Car Prices: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి కార్ల ధరలను పెంచింది. నెక్సా ద్వారా అమ్మే ప్రీమియం కార్ల ధరలను సవరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. కొన్ని మోడళ్లపై రూ.5,000 నుంచి ప్రారంభమైన ఈ పెంపు, కొన్ని వేరియంట్లలో రూ.30,000 వరకు చేరింది. ఇంతకీ ఏ మోడల్ ధర ఎంత పెరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మారుతి నెక్సా శ్రేణిలో ప్రస్తుతం అత్యంత చౌకైన కారు బాలెనో. ఈ హ్యాచ్ బ్యాక్ లోని కొన్ని వేరియంట్ల ధరలు రూ.5,000 నుంచి రూ.7,500 వరకు పెరిగాయి. అయితే బేస్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ కారురూ.5.98 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
బాలెనో ఆధారంగా రూపొందించిన ఫ్రాంక్స్ క్రాస్ ఓవర్ ధరలు కూడా పెరిగాయి. పెట్రోల్ వేరియంట్లపై రూ.5,000, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.7,500 వరకు ధరలు పెంచారు. అయితే దీని ప్రారంభ ధర మాత్రం యథాతథంగా రూ.6.84 లక్షలుగా కొనసాగుతోంది.
మూడు వరుసల సీట్లతో వచ్చే XL6 ఎమ్‌పీవీపై కూడా ధరల ప్రభావం కనిపించింది. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.5,000 పెరగగా, సీఎన్‌జీ వెర్షన్‌పై రూ.10,000 వరకు పెంపు జరిగింది. ప్రస్తుతం ఈ కారు ధరలు రూ.11.57 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.
ఆఫ్ రోడింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన జిమ్నీ SUV ధర కూడా పెరిగింది. అన్ని వేరియంట్లపై రూ.7,500 చొప్పున పెంచడంతో దీని ప్రారంభ ధర రూ.12.39 లక్షలకు చేరుకుంది.
ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ SUV ఈ-విటారా ధర అత్యధికంగా పెరిగింది. ఈ మోడల్‌పై కంపెనీ రూ.30,000 వరకు ధరను పెంచింది. ప్రస్తుతం ఈ కారు ధరలు రూ.15.99 లక్షల నుంచి రూ.20.21 లక్షల మధ్య ఉన్నాయి.
మారుతి సుజుకి లైనప్ లో అత్యంత ఖరీదైన మోడల్ అయిన ఇన్విక్టో ధర కూడా పెరిగింది. జీటా ప్లస్ 8-సీటర్ వేరియంట్‌పై రూ.25,000 వరకు పెంపు జరిగింది. దీంతో ఈ మోడల్ ధర రూ.25.27 లక్షలకు చేరుకుంది. ఇతర వేరియంట్ల ధరల్లో మాత్రం పెద్ద మార్పులు లేవు.
అయితే, అన్ని మోడళ్ల ధరలు పెరగలేదు. గ్రాండ్ విటారా SUVలోని కొన్ని వేరియంట్ల ధరలను కంపెనీ తగ్గించింది. జీటా, ఆల్ఫా (ఆప్షనల్) వేరియంట్లపై రూ.38,900 వరకు తగ్గింపు ప్రకటించింది. దీంతో ఈ మోడల్ కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఉపశమనం లభించింది.
ఇంధన ధరలు, ఇన్ ఫుట్ ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో వాహన తయారీ సంస్థలు తరచుగా ధరలను పెంచుతున్నాయి. తాజాగా ఈ లిస్టులో మారుతి కూడా చేరింది.
Read Also: హోండా అమేజ్ vs మారుతి డిజైర్.. సేఫ్టీలో ఏ కారు బెస్ట్?