ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు సంబంధించిన మొబిలిటీ షేర్లు దాదాపు 10 శాతం పెరిగాయి. ఇవాళ మార్కెట్లు ఓపెన్ అయినప్పటి నుంచి మంచి దూకుడు కనబరిచాయి. కంపెనీ తన ప్రమోటర్, CEO భవిష్ అగర్వాల్ రుణాన్ని తిరిగి చెల్లించడానికి, తన వ్యక్తిగత వాటాలో కొంత భాగాన్ని విక్రయించడాన్ని పూర్తి చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ షేర్లు ఉదయం ట్రేడింగ్ గంటల్లో ఒక్కొక్కటి రూ. 34.38కి పెరిగాయి. ఇది మూడు సెషన్ల నష్టాల పరంపరను ముగించినట్లు అయ్యింది.
ఓలా ఎలక్ట్రిక్ ఏం చెప్పిందంటే?
డిసెంబర్ 18న మార్కెట్ అనంతర సమయంలో విడుదల చేసిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో, భవిష్ అగర్వాల్ దాదాపు రూ. 260 కోట్ల ప్రమోటర్ స్థాయి రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించడానికి తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించారని ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తెలిపింది. గతంలో రుణం కోసం తాకట్టు పెట్టిన 3.93 శాతం షేర్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. “లావాదేవీ తర్వాత, ప్రమోటర్ గ్రూప్ ఓలా ఎలక్ట్రిక్‌లో 34.6% వాటాను కొనసాగిస్తోంది. ప్రమోటర్ నియంత్రణలో ఎటువంటి తగ్గుదల లేదు. ఇది పూర్తిగా ప్రమోటర్ వ్యక్తిగత స్థాయిలో అమలు చేయబడిన ప్రణాళికాబద్ధమైన, సమయానుకూలమైన నిర్ణయం. కంపెనీ పని తీరు, కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపదు” అని కంపెనీ తెలిపింది.
ప్రమోటర్ భవిష్ అగర్వాల్ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించడంతో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు కేవలం మూడు సెషన్లలో 17 శాతానికి పైగా పడిపోయాయి. ఫలితంగా, డిసెంబర్ 18న స్టాక్ ఒక్కసారిగా పడిపోయి ఒక్కో షేరుకు రూ. 30.76 ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. గత సంవత్సరం ఆగస్టు 20న రికార్డు స్థాయిలో ఉన్న రూ. 157.4 నుండి ఇది 80 శాతానికి పైగా నష్టపోయింది.
Read Also: బుకింగ్స్ లో దుమ్మురేపుతున్న టాటా సియెర్రా, 24 గంటల్లో ఏకంగా 70 వేల బుకింగ్స్!
శుక్రవారం ఉదయం 11:02 గంటలకు ఇప్పటివరకు 19.42 మిలియన్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఇది వారి 30 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దాదాపు 4.8 రెట్లు ఎక్కువ. గురువారం, భవిష్ అగర్వాల్ కంపెనీలో 0.6 శాతం వాటాను రూ.90.28 కోట్లకు బల్క్ డీల్ ద్వారా విక్రయించారు. బుధవారం నాడు స్టాక్ ముగింపు ధర కంటే 3 శాతం కంటే ఎక్కువ తగ్గింపుతో ఆయన 2.83 కోట్ల షేర్లను ఒక్కొక్కటి రూ.31.90కి విక్రయించారు. రూ.260 కోట్ల ప్రమోటర్ స్థాయి రుణాన్ని పూర్తిగా చెల్లించడానికి తన వ్యక్తిగత వాటాలో కొంత భాగాన్ని ఒకేసారి అమ్మినట్లు భవిష్ అగర్వాల్ డిసెంబర్ 16న ఎక్స్ఛేంజీలకు తెలియజేశారు. మొత్తంగా ఈ నిర్ణయంతో ఓలా షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి.
Read Also: ఇండిగో వివాదం.. ఇంతకీ దాని యజమాని ఎవరు? ఆయన ఆస్తుల విలువెంతో తెలుసా?