Renault Triber Turbo Mileage: కారు కొనాలని చూస్తున్న కుటుంబాలకు 7 సీటర్ MPVలు ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి. అందులోనూ మంచి స్పేస్‌తో పాటు మైలేజ్, పనితీరు కూడా కావాలనుకునే వారికి రెనాల్ట్ ట్రైబర్ క్రేజీ ఆప్షన్ గా మారింది. తాజాగా రెనాల్ట్ ఇండియా కొత్త ట్రైబర్ టర్బోను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ కారు మైలేజ్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. టర్బో ఇంజిన్ తో వచ్చినప్పటికీ ARAI సర్టిఫైడ్ 21కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.
కొత్త ట్రైబర్ టర్బోలో 1.0 లీటర్, మూడు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ సుమారు 100 PS పవర్, 180 Nm గరిష్ఠ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో పోలిస్తే టర్బో వెర్షన్‌లో పవర్, టార్క్ రెండూ పెరిగాయి. ముఖ్యంగా ఓవర్ టేకింగ్, హైవేపై ప్రయాణించే సమయంలో ఈ అదనపు టార్క్ ఉపయోగపడే అవకాశం ఉంది.
ట్రైబర్ టర్బోకు సంబంధించిన ముఖ్యమైన హైలైట్ మైలేజ్. ARAI సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ కారు మాన్యువల్ వెర్షన్‌లో 21 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ వెర్షన్ 19.76 కిలో మీటర్ల మైలేజ్‌ను కలిగి ఉండగా, కొత్త టర్బో వెర్షన్ దానికంటే ఎక్కువ క్లెయిమ్డ్ మైలేజ్ సాధించింది. సిటీ ట్రాఫిక్, డ్రైవింగ్ స్టైల్, ఏసీ వినియోగం, రహదారి పరిస్థితులను బట్టి వాస్తవ మైలేజ్ మారే అవకాశం ఉంటుంది.
కొత్త ట్రైబర్ టర్బో ను ప్రస్తుతం 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో మాత్రమే అందిస్తున్నారు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ కావాలనుకునే వారికి ప్రస్తుతం టర్బో వెర్షన్‌లో ఆప్షన్ లేదు. అయితే, భవిష్యత్తులో ఆటోమేటిక్ వెర్షన్ వచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు, నాచురల్లీ ఆస్పిరేటెడ్ ట్రైబర్ మాత్రం మాన్యువల్‌తో పాటు AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌తో కొనసాగుతోంది.
ట్రైబర్ టర్బోను మూడు వేరియంట్లలో విడుదల చేశారు. బేస్ ఎవల్యూషన్ టర్బో MT ధర రూ.7.84 లక్షలు. టెక్నో టర్బో MT ధర రూ.8.53 లక్షలు కాగా, టాప్ స్పెక్ ఎమోషన్ టర్బో MT ధర రూ.8.99 లక్షలు. ఇక నాచురల్లీ ఆస్పిరేటెడ్ ట్రైబర్ ధరలు సుమారు రూ.5.80 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. టర్బో వెర్షన్ కు సమానమైన వేరియంట్‌తో పోలిస్తే అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది. ట్రైబర్ లో ప్రధాన ఆకర్షణ దాని 7 సీటర్ లే అవుట్. రెండో వరుస సీట్లను స్లైడ్, రిక్లైన్ చేయవచ్చు. మూడో వరుస సీట్లను అవసరానికి అనుగుణంగా తొలగించే సౌలభ్యం కూడా ఉంది.
Read Also: 30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!