Samsung Status Bar Icons: శాంసంగ్ గెలాక్సీ ఫోన్ వాడుతున్నప్పుడు నోటిఫికేషన్ బార్‌లో రోజూ ఎన్నో రకాల ఐకాన్లు కనిపిస్తుంటాయి. వైఫై, బ్లూటూత్, బ్యాటరీ వంటి సింబల్స్ గురించి చాలామందికి తెలుసు. కానీ అప్పుడప్పుడు స్క్రీన్ పైభాగంలో ఒక సర్కిల్ మధ్యలో అడ్డంగా గీత ఉన్న ఐకాన్ కనిపిస్తే మాత్రం అసలు దాని అర్థమేంటో తెలియక చాలామంది కంగారుపడుతుంటారు. ఫోన్‌లో ఏదైనా సమస్య వచ్చిందా? నెట్‌వర్క్ పోయిందా? అని అనుమానం వస్తుంది. అయితే నిజానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఐకాన్ మీ ఫోన్‌లో నెట్‌వర్క్ సిగ్నల్‌కు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని మాత్రమే తెలియజేస్తుంది. అసలు ఈ సింబల్ అర్థం ఏంటి? ఇది ఎందుకు కనిపిస్తుంది? కనిపించినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
నోటిఫికేషన్ బార్‌లో ఈ సింబల్ కనిపిస్తుందంటే.. మీ మొబైల్‌కు సెల్యులార్ నెట్‌వర్క్ అస్సలు దొరకడం లేదని అర్థం. మీ నెట్‌వర్క్ ఆపరేటర్ పరిధి లేని ప్రాంతంలో మీరు ఉన్నప్పుడు లేదా కంపెనీ వైపు నుంచి సర్వర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇది వస్తుంది. ఒకవేళ మీ పక్కన ఉన్న వేరే ఫోన్లలో అదే కంపెనీ సిగ్నల్ వస్తూ.. మీ ఫోన్లోనే రాకపోతే మాత్రం సిమ్ సరిగ్గా కూర్చోకపోవడం లేదా ఫోన్ సెట్టింగ్స్‌లో ఏదైనా సమస్య ఉండవచ్చు.
Also Read: MacBook Air M5 ప్రియం అనుకుంటున్నారా? క్రోమా ఆఫర్ చూస్తే పక్కా కొనేస్తారు!
ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ముందుగా కంగారు పడకుండా మీ శాంసంగ్ ఫోన్‌ను ఒకసారి రీస్టార్ట్ చేయండి. పవర్ బటన్, వాల్యూమ్ తగ్గించే బటన్‌ను ఒకేసారి 10 సెకన్ల పాటు పట్టుకుంటే రీస్టార్ట్ ఆప్షన్ వస్తుంది. చిన్న చిన్న సాఫ్ట్‌వేర్ ఇబ్బందులు ఏమైనా ఉంటే ఫోన్ రీస్టార్ట్ కాగానే నెట్‌వర్క్ తిరిగి వచ్చేస్తుంది.
రీస్టార్ట్ చేసినా సమస్య సాల్వ్ అవ్వకపోతే ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి రీసెట్ నెట్‌వర్క్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఎంచుకోండి. దీనివల్ల పాత నెట్‌వర్క్ డేటా రీసెట్ అవుతుంది. ఆ తర్వాత కూడా సిగ్నల్ రాకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, సిమ్ ట్రే బయటకు తీసి సిమ్ కార్డును ఒకసారి శుభ్రం చేసి మళ్లీ సరిగ్గా పెట్టండి.
సిమ్ కార్డు తీసి వేరే ఫోన్లో వేసి చూడండి. వేరే ఫోన్లో కూడా సిగ్నల్ రాకపోతే మీ సిమ్ కార్డు పాడైపోయినట్లే. అప్పుడు మీరు సంబంధిత కంపెనీ స్టోర్‌కు వెళ్లి కొత్త సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సిమ్ వేరే ఫోన్లో బాగా పనిచేస్తే మాత్రం మీ శాంసంగ్ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయాలి లేదా దగ్గర్లోని సర్వీస్ సెంటర్‌కు వెళ్లి చూపించుకోవడం మంచిది.
Also Read: జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!